రాష్ట్రంలో మార్స్‌ గ్రూప్‌ పెట్టుబడి మరో రూ.800 కోట్లు 

26 Aug, 2023 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్‌) తినే ఆహార ఉత్పత్తుల్లో పేరొందిన ‘మార్స్‌ గ్రూప్‌’తెలంగాణలో మరో రూ.800 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో శుక్రవారం మార్స్‌ చీఫ్‌ డేటా, అనలిటిక్స్‌ ఆఫీసర్‌ శేఖర్‌ కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది.

సిద్దిపేటలో ఇప్పటికే తమ పెంపుడు జంతువుల (పెట్స్‌) ఫుడ్‌ తయారీ ప్లాంట్‌ ద్వారా కార్యకలా పాలు నిర్వహిస్తున్నట్లు ఆ బృందం వెల్లడించింది. మొదట కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి, ఆ తర్వాత మరో రూ.500 కోట్లతో విస్తరించామని పేర్కొంది.

తాజాగా మరో రూ.800 కోట్లతో విస్తరణ ప్రణాళికను చేపడతామని మార్స్‌ గ్రూప్‌ ప్రతినిధి బృందం వెల్లడించింది. పెట్‌ కేర్, పెట్‌ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కేవలం తయారీకే కాకుండా పరిశోధన, అభివృద్ధి తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను ఈ బృందం వివరించింది. 

కొత్త పెట్టుబడులు, విస్తరణలకు ప్రాధాన్యత 
 కొత్త పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించిన మార్స్‌ గ్రూప్‌ పెట్టుబడులు విడతల వారీగా రూ.1500 కోట్లకు చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు