కొడుకా మంచి మార్కులతోనే పాసయ్యావు కదరా..

10 May, 2023 12:37 IST|Sakshi

వరంగల్: ‘మమ్మి.. డాడీ ఐయామ్‌ సారీ.. ఎంబీబీఎస్‌ సీటు రాదేమోనని అనిపిస్తుంది’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న ఓ విద్యార్థి.. మంగళవారం వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించగా, కుమారుడి రిజల్ట్‌ చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పీక్లాతండా జీపీ శివారు బోడగుట్టతండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతిల పెద్దకుమారుడైన కృష్ణ ఏటూరునాగారం ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో ఇంటరీ్మడియట్‌(బైపీసీ)చదివి, పరీక్షలు రాసి వచ్చాడు.

ఎంబీబీఎస్‌ సీటు సాధించాలనే లక్ష్యంతో నీట్‌ ప్రిపేర్‌ అవుతున్న క్రమంలో, గత నెల 11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో క్రిష్ణ (బైపీసీ సెకండియర్‌) 892/1000 మార్కులు సా ధించి ఏ గ్రేడ్‌లో పాసయ్యాడు. కొడుకు రిజల్ట్‌ చూ సిన అతడి తల్లిదండ్రులు.. ‘కొడుకా నువ్వు మంచి మార్కులతోనే పాసయ్యావు కదరా, తొందరపడి మమ్మల్ని వదిలి పోతివి కదరా..బిడ్డా’ అంటూ జ్ఞాపకాలను తలచుకుంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.

మరిన్ని వార్తలు