నగరంలో ప్రారంభమైన మెట్రో సేవలు

7 Sep, 2020 10:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సుమారు ఐదు నెలలకుపైగా విరామం అనంతరం సోమవారం మెట్రో రైళ్లు పట్టాలెక్కాయి. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు మియాపూర్‌– ఎల్బీనగర్‌ రూట్లో మెట్రో జర్నీ చేసేందుకు సిటీజన్లకు అవకాశం లభించింది. మంగళవారం నుంచి నాగోల్‌– రాయదుర్గం రూట్లో మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. బుధవారం నుంచి జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ సహా మూడు రూట్లలో 69.2 కి.మీ రూట్లో మెట్రో రైళ్లు పరుగెత్తనున్నాయి. బుధవారం నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం సుమారు 3.5– 4 లక్షల మంది జర్నీ చేసేవారు. ( హైదరాబాద్‌ మెట్రో.. ఇవి తెలుసుకోండి )

ప్రస్తుతం అందులో సగమైనా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారా లేదా అనేది సందేహంగా మారింది. కోవిడ్‌ విజృంభిస్తోన్న తరుణంలో అన్ని పటిష్టమైన భద్రత, రక్షణ, శానిటైజేషన్‌ చర్యలతో రైళ్లను నడుపుతామని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని ఐదు స్టేషన్లలో మెట్రో రైలు నిలపబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా నగరంలోని గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని.. ప్రయాణికులను స్టేషన్లలోకి అనుమతించబోరని తెలిపారు.

మార్గదర్శకాలిలా.. 

  • ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు రైళ్లను నడిపే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. 
  • స్టేషన్లు, బోగీల్లో ప్రయాణికుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేందుకు ప్రత్యేకంగా –వృత్తాకార మార్కింగ్‌లు చేయనున్నారు. 
  • బోగీల్లోనూ ప్రయాణికులు పక్కపక్క సీట్లలో కూర్చోకుండా ఏర్పాట్లు చేశారు. 
  • ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉందా లేదా అనే విషయాన్ని సీసీటీవీలతో పాటు ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. 
  • మాస్క్‌ లేని ప్రయాణికులను స్టేషన్‌లోనికి అనుమతించరు. మాస్క్‌లు విక్రయించేందుకు స్టేషన్లలో ఏర్పాట్లు చేయనున్నారు. 
  • మార్గదర్శకాలను అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తారు. 
  • స్టేషన్‌లోనికి ప్రవేశించే సమయంలోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. 
  • ఆరోగ్య సేతు యాప్‌ని వినియోగించేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు. 
  • స్టేషన్‌లోనికి ప్రవేశించే ముందు శానిటైజర్‌ వినియోగించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. 
  • మెట్రో సిబ్బందికి అవసరమైన మేర పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేస్తారు. 
  • స్మార్ట్‌మెట్రో కార్డ్, మొబైల్‌ క్యూఆర్‌ టికెట్‌లతో జర్నీ చేసేలా ప్రయాణికులను ప్రోత్సహించనున్నారు. 
  • ప్రయాణికులు స్వల్ప లగేజీ (మెటల్‌ కాదు)తో ప్రయాణించవచ్చు. వారితోపాటు శానిటైజర్‌ తెచ్చుకోవచ్చు. 
  • యథావిధిగా పార్కింగ్‌ స్థలాలు అందుబాటులో ఉంటాయి. 

దశల వారీగా మెట్రో రైళ్ల రాకపోకలు ఇలా.. 
ఫేజ్‌–1: మియాపూర్‌– ఎల్బీనగర్‌ (కారిడార్‌– 1) సెప్టెంబర్‌ 7 నుంచి రైళ్లను నడుపుతారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లు  నడపనున్నారు. 
ఫేజ్‌– 2: నాగోల్‌– రాయదుర్గం రూట్లో సెప్టెంబరు 8 నుంచి మెట్రో రైళ్లను నడపనున్నారు. ఈ రూట్లోనూ ఉదయం 7 నుంచి 12.. తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. 
ఫేజ్‌– 3: జేబీఎస్‌– ఎంజీబీఎస్‌తో పాటు పైరెండు రూట్లలోనూ మెట్రో రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వార్తలు