పీవీకి అసలైన గౌరవమిచ్చింది మేమే

5 Mar, 2021 03:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఇప్పుడు పీవీ కుమార్తె సురభి వాణీదేవికి హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంతో మరింత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెను గెలిపించి పీవీకి అసలైన నివాళి ఇవ్వాలని గంగుల పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, డివిజన్‌ ఇన్‌చార్జులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తోపాటు మంత్రులు మహమూద్‌ అలీ, తల సాని శ్రీనివాస్‌యాదవ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన ఈ ఏడేళ్లలో సరికొత్త అవకాశాలను సృష్టించుకుంటూ రాష్ట్రం ముందుకుపోతోందన్నారు. ప్రభుత్వ రంగంలో కేవలం ఆరేళ్లలోనే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. ప్రైవేటు రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాల కల్పనకు కృషి చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌కు ఇవ్వకుండా తన్నుకుపోయిన గద్దలు బీజేపీ నేతలని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 3,400 మంది కార్యకర్తలతో డివిజన్ల వారీగా ఇన్‌చార్జీలను నియమించి, ప్రతి 50 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 1.53 లక్షలకుపైగా ఓటర్లను కలిసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు