చిన్న నీటి వనరుల మరమ్మతులపై జీఎస్టీని ఎత్తేయాలి 

18 Dec, 2022 00:58 IST|Sakshi
జీఎస్టీ కౌన్సిల్‌ జూమ్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ 

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ 

బీడీ ఆకులు, కస్టమ్‌ మిల్లింగ్‌పైనా మినహాయింపు ఇవ్వాలి 

జూమ్‌ సమావేశంలోపాల్గొన్న మంత్రి  

సాక్షి, హైదరాబాద్‌: చిన్ననీటి వనరుల నిర్వహణ, మరమ్మతులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో చిన్ననీటి వనరుల కింద 46 వేల జలాశయాలున్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.

జూమ్‌ ద్వారా జరిగిన ఈ భేటీలో మంత్రి హరీశ్‌రావు పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమైనదని అందువల్ల మరమ్మతు పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. అలాగే పీడీఎస్‌ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్‌ మిల్లింగ్, రవాణా సేవలకు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోందని ఆయన వివరించారు.

లక్షలాది మంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమపై ఇప్పటికే 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, బీడీ ఆకులపై మరో 16 శాతం పన్ను విధించడం వల్ల పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందో ళన వ్యక్తం చేశారు. బీడీలపై పన్నును తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 

బీడీ ఆకులపై పన్ను మినహాయింపు ఇవ్వాలి
బీడీ ఆకులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని హరీశ్‌ కోరారు. పన్నుల ఇన్‌వాయిస్‌ నిబంధనల సవరణ ప్రతిపాదనలను తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.  టెలికాం సేవలకు సంబంధించి ట్రాయ్‌ నిబంధనల వల్ల ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తుందని, దీనిని పరిశీలించి మార్పులు చేయాలని కోరారు.

కాగా, ఈ విజ్ఞప్తులను పరిశీలన కోసం ఫిట్‌మెంట్‌ కమిటీకి సిఫారసు చేస్తూ కౌన్సిల్‌ ఆదేశించింది. పన్నుల ఇన్‌వాయిస్‌ లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. బీఆర్‌కే భవన్‌ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో   హరీశ్‌తోపాటు సీఎస్‌ సోమేశ్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు