రాహుల్‌ సింగ్‌ మెరుపు శతకం

6 Dec, 2023 00:50 IST|Sakshi

56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 పరుగులు చేసిన కెప్టెన్‌

ఐదు వికెట్లు తీసిన కార్తికేయ

చివరి లీగ్‌ మ్యాచ్‌లో మేఘాలయపై హైదరాబాద్‌ ఘన విజయం

జైపూర్‌: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ను హైదరాబాద్‌ జట్టు విజయంతో ముగించింది. మేఘాలయ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ 41.1 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. కార్తికేయ కక్‌ 36 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మేఘాలయను కట్టడి చేశాడు. రోహిత్‌ రాయుడు  రెండు వికెట్లు తీశాడు.

అనంతరం హైదరాబాద్‌ కేవలం 18.4 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 161 పరుగులు సాధించి గెలిచింది. కెపె్టన్‌ గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌ (56 బంతుల్లో 105 నాటౌట్‌; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ మెరుపు శతకం సాధించి హైదరాబాద్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌ రాయుడు (0) డకౌట్‌కాగా... మరో ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (54 బంతుల్లో 49 నాటౌట్‌; 8 ఫోర్లు)తో కలిసి రాహుల్‌ సింగ్‌ రెండో వికెట్‌కు అజేయంగా 159 పరుగులు జోడించాడు.

ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘బి’లో హైదరాబాద్‌ తమ ఏడు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్‌ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. గ్రూప్‌ ‘డి’లో పోటీపడ్డ ఆంధ్ర జట్టు ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.  మంగళవారంతో విజయ్‌ హజారే ట్రోఫీ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి.

హరియాణా, రాజస్తాన్, విదర్భ, కర్ణాటక, ముంబై, తమిళనాడు జట్లు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాయి. మిగిలిన రెండు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ల కోసం ఈనెల 9న ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో బెంగాల్‌తో గుజరాత్‌; కేరళతో మహారాష్ట్ర తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో నెగ్గిన రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశిస్తాయి. 

>
మరిన్ని వార్తలు