‘బోరు’మంటున్న సాగర్‌ ఆయకట్టు

21 Sep, 2023 01:48 IST|Sakshi
మేళ్లచెరువు మండలం వేపల మాదారంలో పొలంలో బోరు వేస్తున్న దృశ్యం

పైనుంచి రాని కృష్ణమ్మ 

డెడ్‌ స్టోరేజీకి దగ్గరలో నాగార్జునసాగర్‌ 

3,81,022 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా కేవలం లక్షన్నర ఎకరాల్లోనే సాగు.. ఆ పంటను కాపాడుకునేందుకే అన్నదాతల సాగునీటి గోస!  

పాత బావుల్లో పూడిక తీయిస్తున్న రైతులు 

కొత్తగా బోర్లు, పైపులైన్లు వేయిస్తున్న మరికొందరు

భారీగా పెరిగిన వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 

నల్లగొండ జిల్లా త్రిపురారం గ్రామంలో నాగిరెడ్డికి 18 ఎకరాలు ఉంది. నాగార్జున సాగర్‌ నీటిపై ఆశలు సన్న గిల్లడంతో ఒక్కొక్కటిగా 8 బోర్లు వేయించారు. రూ.3 లక్షలు ఖర్చు చేశారు. ఎడమ కాలువ ద్వారా నీరు వస్తే బోర్లు వేయకుండా సాగు చేసుకునే వాడినని, అదనపు ఖర్చుతో సాగు చేయాల్సి వస్తోందని నిట్టూరుస్తున్నాడు.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వేపలమాధారం గ్రామానికి చెందిన రైతు మర్ల మల్లయ్య. తనకున్న రెండెకరాల పొలంలో బోరు ఉండటంతో వరి వేశారు. ఇటీవల బోరు ఎండిపోయింది. సాగర్‌ కాలువలో నీరు లేదు. పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఆరు చోట్ల బోరు వేయించారు. అయినా చుక్క నీరు పడలేదు. బోర్లు వేయించేందుకు రూ. 1.80 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో వాన నీటి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. 

► నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టులో కరువు ఛాయలు అలముకున్నాయి. ప్రాజెక్టులో నీరు డెడ్‌ స్టోరేజీకి దగ్గరలో ఉండటంతో నీటి విడుదల లేదు. కాలువల ద్వారా నీరు రాకపోవడంతో చాలా వరకు భూమినే సాగు చేయకపోగా, జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు కొన్ని చోట్ల సాగు చేసిన వరి పొలాలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున బోర్లు వేస్తున్నారు. ఈ మూడు నెలల్లో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో బోర్లు వేశారు. మరికొంత మంది ఏళ్లతరబడి వాడకుండా వదిలేసిన పాత బావుల్లో పూడిక తీయిస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు సాగునీటి కోసం జిల్లా రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది.

20 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం? 
సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో 2001లో తీవ్ర కరువు నెలకొంది. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాలువకు నీటిని విడుదల చేయలేదు. ఆ సమయంలో ఆయకట్టు ప్రాంతంలోని రైతులు అనేక బావులను తవ్వించారు. బోర్లను వేశారు. ప్రస్తుతం సాగర్‌ ప్రాజెక్టులో నీరు డెడ్‌స్టోరేజ్‌కి దగ్గరగా ఉంది. నాగార్జునసాగర్‌లో డెడ్‌ స్టోరేజీ 510 అడుగులు కాగా ప్రస్తుతం 524 అడుగుల నీరుంది. దానిని సాగునీటికి ఇచ్చే పరిస్థితి లేదు. పైనుంచి చుక్క నీరు రావడం లేదు. ఇప్పట్లో కాలువలకు నీటిని వదిలే పరిస్థితి లేదు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాగర్‌ ఆయకట్టు కింద 3,81,022 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉన్నా, లక్షన్నర ఎకరాలే సాగైంది. ప్రస్తుతం వాటిని కాపాడుకునేందుకు రైతులు బావులు, బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

పాత కనెక్షన్లు.. కొత్త బోర్లు 
నల్లగొండ జిల్లాలోని త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్‌), అనుముల, మిర్యాలగూడ, మాడ్గులపల్లి, వేములపల్లి, గరిడేపల్లి, హుజూర్‌నగర్, చిలుకూరు, కోదాడ, అనంతగిరి మండలాల్లో రైతులు పాత బావుల పూడిక తీయిస్తుండగా మరికొందరు, పాత బోర్లను బాగు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇంకొంతమంది కొత్తగా బోర్లు వేస్తున్నారు. వాటితోపాటు కొత్తగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుంటూ బోర్లు వేయిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 5 వేలకు పైగా బోర్లు వేయించినట్లు అంచనా. ఒక్కో బోరు వేయించేందుకు, విద్యుత్తు కనెక్షన్‌ తీసుకునేందుకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు అదనంగా వెచ్చిస్తున్నారు. 

ఈ కనెక్షన్లన్నీ బోర్ల కోసమే! 
► పంటలను కాపాడుకునేందుకు బోర్లను వేయిస్తున్న రైతులు అధిక సంఖ్యలో విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుంటున్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈ ఏడాది 8131 మంది రైతులు కొత్తగా విద్యుత్తు కనెక్షన్లకు దరఖాస్తు చేశారు. నల్లగొండ డివిజన్‌లో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెలాఖరు వరకే 1737 మంది రైతులు కొత్తగా కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, విద్యుత్‌ శాఖ 1556 మందికి కనెక్షన్లు జారీ చేసింది. దేవరకొండ డివిజన్‌లో 1003 మంది దరఖాస్తు చేసుకుంటే 725 మందికి కనెక్షన్లు ఇచ్చింది. మిర్యాలగూడ డివిజన్‌లో 1533 మంది దరఖాస్తు చేసుకుంటే 1101 మందికి, సూర్యాపేట డివిజన్‌లో ఈ ఏడాది కొత్త విద్యుత్తు కనెక్షన్ల కోసం 1974 దరఖాస్తులు రాగా, 1502 జారీ చేశారు. హుజూర్‌నగర్‌ డివిజన్‌లో 1884 దరఖాస్తులు రాగా, 1817 కనెక్షన్లు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు