గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ.. 

18 Aug, 2023 02:19 IST|Sakshi

రాత్రంతా ఠాణాలోనే ఉంచి చిత్రహింసలు  

ఒళ్లు కమిలేలా లాఠీలతో కొట్టారు.. బూటుకాళ్లతో తన్నారు 

ఎల్‌బీనగర్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన..  

నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్‌లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది.

స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్‌బీనగర్‌కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది.

అదే సమయంలో పెట్రోలింగ్‌ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్‌బీనగర్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్‌ కానిస్టేబుల్‌ శివశంకర్, మహిళా కానిస్టేబుల్‌ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. 

పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు
లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్‌బీనగర్‌ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం.

కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్‌బీనగర్‌ స్టేషన్‌ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు 354, 324, 379,సెక్షన్‌3(1) (ఆర్‌)(ఎస్‌), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా..
గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్‌బీనగర్‌ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు.      

డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు
ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్‌ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.      – బాధితురాలు లక్ష్మి 

అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు
ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్‌ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్‌ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్‌బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి తెలిపారు.      – ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి  

ఇద్దరి సస్పెన్షన్‌..
జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ శివశంకర్, మహిళా కానిస్టేబుల్‌ సుమలతలను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్‌బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపారు.

గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్‌ 

  • గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్‌ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్‌ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు