మొయినాబాద్‌లో రూ.7.5 కోట్లు పట్టివేత

19 Nov, 2023 05:19 IST|Sakshi
మొయినాబాద్‌లో పట్టుబడ్డ నగదు

ఆరు కార్లు స్వాదీనం 

కార్లు పట్టుబడింది ఓ మంత్రి డెయిరీ ఫాం పక్కనే 

మొయినాబాద్‌/సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల వేళ మొయినాబాద్‌లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శనివారం సాయంత్రం అజీజ్‌నగర్‌ రెవెన్యూలోని ఓ మట్టి రోడ్డులో ఏకంగా ఆరు కార్లలో తరలిస్తున్న రూ.7.5 కోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కార్లలో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

డబ్బులు తరలిస్తున్న కార్ల నంబర్లు టీఎస్‌ 36 కె 3030, టీఎస్‌ 07 జేకే 4688, టీఎస్‌ 09 ఈడబ్ల్యూ 3747, ఏపీ 39 ఏఎం 4442, టీఎస్‌ 02 ఎఫ్‌ఈ 8332, టీఎస్‌ 09 జీబీ 5841. రాజేంద్రనగర్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఐటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబ్బులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. కార్లను మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఓ విద్యా సంస్థ చైర్మన్‌ ఇంట్లో నుంచి బయటకొచ్చిన కార్లు? 
మొయినాబాద్‌లో నగదు తరలిస్తూ పట్టుబడిన కార్లు ఓ విద్యా సంస్థ చైర్మన్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అజీజ్‌నగర్‌ రెవెన్యూలో విద్యా సంస్థ నిర్వహిస్తున్న ఆ సంస్థ చైర్మన్‌ హిమాయత్‌సాగర్‌ జలాశయం ఒడ్డునే నివాసముంటున్నట్లు సమాచారం. ఆ ఇంట్లో నుంచి కార్లు బయటకు రాగానే విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు కార్లను పట్టుకున్నట్లు తెలిసింది. కార్లలో డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలు మాత్రం తెలియలేదు. కార్లు పట్టుబడింది ఓ మంత్రి డెయిరీ ఫాం పక్కనే కావడం విశేషం. 

ఆ విద్యా సంస్థ చైర్మన్‌ ఇంట్లో ఐటీ సోదాలు? 
కాగా ఆ విద్యా సంస్థ చైర్మన్‌ ఇంట్లో ఐటీ అధికారులు శనివారం రాత్రి సోదాలు చేపట్టినట్టు సమాచారం. అక్కడి ఇంటితో పాటు ఐటీ అధికారులు, పోలీసులు సదరు చైర్మన్‌కు సంబంధించిన ఫుట్‌ బాల్‌ అకాడమీ, క్రికెట్‌ అకాడమీ కార్యాలయాల్లో సైతం సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్లలో పట్టుబడిన ఆ సొమ్ముతో సదరు సంస్థకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు