నీట్‌ తేలేదెప్పుడు..? క్లాసులు కదిలేదెప్పుడు..? 

18 Nov, 2021 03:13 IST|Sakshi

వైద్య ప్రవేశాల ప్రక్రియలో జాప్యం

ఫలితాలు వచ్చి రెండు వారాలైనా రాష్ట్రానికి అందని నీట్‌ ర్యాంకులు

దీంతో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీలో మరింత జాప్యం

మొదటి ఏడాది తరగతులు నాలుగైదు నెలలు ఆలస్యం 

సాక్షి, హైదరాబాద్‌:  జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు వచ్చి రెండు వారాలైనా ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. జాతీయస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన నీట్‌ ర్యాంకులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికీ విడుదల చేయలేదు. వాటిని ఇప్పటికే రాష్ట్రాలకు పంపాల్సి ఉండగా, మరింత ఆలస్యం అవుతోంది. త్వరలో రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారే కానీ, ఎప్పుడనేది స్పష్టత లేదు.

దీంతో నీట్‌ అర్హత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పలేదు. వాస్తవంగా నీట్‌ ఫలితాల ప్రకటన సమయంలోనే షెడ్యూల్‌ వంటి వాటిపై స్పష్టత ఇవ్వాలని, కానీ ఈ విషయంలో ప్రతీసారి అస్పష్టతే ఉంటోందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి. కరోనా కారణంగా గతేడాది వైద్య విద్య ప్రవేశాల్లో జాప్యం జరగ్గా, ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వైద్య విద్యా సంవత్సరం గందరగోళానికి గురవుతుందని వాపోతున్నారు. 

నాలుగైదు నెలలు ఆలస్యంగా ప్రవేశాలు 
ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ ఫలితాలు ఈ నెల 1న విడుదలయ్యాయి. అనేకమంది తెలంగాణ విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను జాతీయస్థాయి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఎయిమ్స్, జిప్‌మర్‌ వంటి ప్రసిద్ధ వైద్య సంస్థల్లోని సీట్లనూ నీట్‌ ద్వారానే భర్తీ చేస్తారు. అందుకోసం ముందుగా జాతీయ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.రెండు విడతల జాతీయ కౌన్సెలింగ్‌ తర్వాత 15 శాతం సీట్లలో ఏవైనా మిగిలితే వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు. వాటిని రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనే నింపుకోవచ్చు.

జాతీయస్థాయి కౌన్సెలింగ్‌ మొదలైన వెంటనే రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ జారీచేస్తారు. కరోనాకు ముందు సాధారణంగా ఆగస్టులో మెడికల్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యేవి. కరోనా వల్ల గతేడా ది చాలా ఆలస్యంగా తరగతులు మొదలుకాగా, ఈసారి మహమ్మారి తీవ్రత తగ్గినా కూడా మరింత జాప్యం అవుతోంది. త్వరగా కౌన్సెలింగ్‌ మొదలుపెడితే డిసెంబర్‌లో తరగతులు ప్రారంభించడానికి వీ లుండేది. అయితే, జనవరిలో ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. 

ఫస్టియర్‌ ఫెయిలైన విద్యార్థులెక్కువ.. 
కరోనా కారణంగా వైద్య విద్యార్థులు చాలావరకు నష్టపోయారు. పది, ఇంటర్‌ మాదిరిగా ఆపై తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్‌ చేయడం కుదరదు. అయితే, వైద్య విద్యార్థుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. 50 శాతం మార్కులు వస్తేనే పాసైనట్లు లెక్క. కరోనా వల్ల గతేడాది కాళోజీ వర్సిటీ పరిధిలో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య పెరిగింది. నేరుగా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి సకాలంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించి, త్వరగా తరగతులు ప్రారంభించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.   


 

మరిన్ని వార్తలు