పైపుల ద్వారా లోపలికి ప్రవేశించి.. సింగోజి చెరువులో..

8 Nov, 2022 20:02 IST|Sakshi

వర్షాలతో నేలమట్టమైన రక్షణ గోడ 

సాక్షి, హైదరాబాద్‌: అది వన్యమృగాలు సంచరించే ప్రాంతం. పులులు, సింహాల సఫారీ కూడా అక్కడే ఉంది. ఈ ప్రదేశంలో జన సంచారం నిషేధం. కానీ.. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మాత్రం ఇక్కడ సంచరించేందుకు ఎలాంటి ఆంక్షల్లేవు. గతేడాది కురిసిన వర్షాలకు కూలిన జూ గోడను మళ్లీ కట్టకపోవడంతో జంతువులకే కాదు.. స్థానికులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. రక్షణ గోడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు జంతు ప్రదర్శనశాలలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఉన్న సింగోజి చెరువులో చేపలు వేట కోసం గోడ కూలిన ప్రాంతం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. కాగా.. సింగోజి చెరువులో భారీగా మొసళ్లు ఉన్నట్లు తేలింది. ఇటీవల ఓ మొసలి ఏకంగా గోడ కూలిన ప్రాంతం నుంచి నీటి ప్రవాహంలో బయటకు వచ్చి మూసీ నదిలో ప్రత్యక్షం కావడం గమనార్హం.  

జూ వెనుక భాగంలో.. 
► గతేడాది భారీ వర్షాలకు జూ వెనుక భాగంలోని ప్రహరీ గోడ కూలిపోయింది. గోడను పునర్‌ నిర్మించకుండా కేవలం వరద నీరు బయటకు వెళ్లేలా కొన్ని పైపులు వేసి.. కల్వర్టు నిర్మించారు. దీంతో జూలోకి సులువుగా వెళ్లడానికి స్థానికులకు అవకాశమేర్పడింది. వానాకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జూలోని సింగోజి చెరువు నిండుకుండలా మారింది. ఇందులోకి చేపలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే జూ వెనుక కిషన్‌బాగ్, బహుదూర్‌పురా ప్రాంతాలకు చెందిన  యువకులు ఈ చెరువులో చేపలు పట్టడానికి.. గోడ కూలిన వేసిన వేసిన పైపుల నుంచి జూలోకి ప్రవేశిస్తున్నారు.  

► సింగోజి చెరువులో మొసళ్లు ఉన్న విషయాన్ని జూ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ ప్రాంతం నుంచే లోపలికి ప్రవేశించిన ఒకరు పులిని చంపిన ఘటన నేర్పిన పాఠాలను కూడా జూ అధికారులు మరిచిపోవడం దారుణమని జంతు ప్రేమికులు అంటున్నారు. ఇదే జూలో ఎలుగుబంటి కూడా  బయటకు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వస్తోంది.   

బయటి వ్యక్తులను అడ్డుకుంటాం..   
గోడ నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌కు ఇచ్చాం. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశాడు. గోడ కూలిన ప్రాంతం నుంచి వ్యక్తులను లోపలి రాకుండా నిఘా పెడతాం. 
– రాజశేఖర్, జూ క్యూరేటర్‌

మరిన్ని వార్తలు