Omicron Variant: ‘ఒమిక్రాన్‌తో భయం లేదు.. అలా అని నిర్లక్ష్యం చేశారో అంతే..’

18 Dec, 2021 14:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చింది. వ్యాధి తీవ్రత లేదు. 95 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటంలేదు. రాష్ట్రంలో నమోదైన తొమ్మిది కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవు. డెల్టా వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోగా, ఒమిక్రాన్‌తో ఇప్పటివరకు యూకేలో మాత్రమే ఒక మరణం సంభవించింది. అది పుట్టిన దక్షిణాఫ్రికాలో ఎలాంటి మరణాలులేవు. కాబట్టి ఒమిక్రాన్‌తో ప్రాణాలకు ప్రమాదంలేదు. ఎలాంటి భయాలు అవసరం లేదు. అలా అని అజాగ్రత్త వద్దు. నిర్లక్ష్యం సామాజిక వ్యాప్తికి దారితీస్తుంద’ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ఒమిక్రాన్‌ తీవ్రత ఎలా ఉంటుందో తెలియదని, రెండు మూడు వారాల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘ఒమిక్రాన్‌ వేరియంట్‌లో 30 నుంచి 50 వరకు పరివర్తనాలు వచ్చాయి. అందుకే వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుంది. కొన్నిచోట్ల వ్యాక్సిన్‌ వేసుకున్నా ఒమిక్రాన్‌ వస్తుంది’ అని చెప్పారు.  

ప్రస్తుతం రాష్ట్రంలో 8 కేసులు 
శుక్రవారం రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య తొమ్మిదికి చేరుకుందని శ్రీనివాసరావు తెలిపారు. అందులో ఒకరు పశ్చిమబెంగాల్‌కు వెళ్లగా, తెలంగాణలో ప్రస్తుతం 8 కేసులున్నాయని చెప్పారు. తాజాగా హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ సోకిందన్నారు. ఆమె యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు విమానాశ్రయంలో నెగెటివ్‌ వచ్చిందని, ఎనిమిది రోజుల తర్వాత చేసిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ తేలితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్‌ బయటపడిందని వివరించారు. ఆమె ప్రస్తుతం టిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. మరో కేసుకు సంబంధించిన వివరాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ ముప్పున్న దేశాల నుంచి 6,764 మంది రాష్ట్రానికి రాగా, ఇద్దరిలో ఒమిక్రాన్‌ వెలుగుచూసిందన్నారు. ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారిలో రెండు శాతం మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, ఏడుగురికి ఒమిక్రాన్‌ సోకినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైనవన్నీ కూడా ఇతర దేశాల నుంచే వచ్చినవేనని స్పష్టంచేశారు. తెలంగాణకు చెందిన ఎవరికీ ఒమిక్రాన్‌ రాలేదని, ఒమిక్రాన్‌ సామాజికవ్యాప్తి జరగలేదని తేల్చిచెప్పారు. ఒక్క కేసు తప్పితే మిగిలినవన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయన్నారు.  

వారందరికీ పరీక్షలు చేయలేం 
కేంద్రం నిబంధనల ప్రకారమే విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ‘ముప్పులేని దేశాల నుంచి వచ్చే వారందరికీ పరీక్షలు చేయడం సాధ్యంకాదు. రెండు శాతం మందికే చేస్తున్నాం. విమానాశ్రయం కేంద్రం నియంత్రణలో ఉంటుంది. ఏం చేయాలన్నా కేంద్రమే నిర్ణయించాలి’ అని చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారి వద్దకు తమ బృందాలు వెళ్తున్నాయని, అవసరమైన చోట పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. 

ఒమిక్రాన్‌ బాధితులు పూర్తి టీకా తీసుకోలేదు 
రాష్ట్రంలో నమోదైన 9 ఒమిక్రాన్‌ కేసుల్లో కొందరు ఒక డోస్‌ వేసుకోగా, కొందరు అసలు వ్యాక్సినే వేసుకోలేదని శ్రీనివాసరావు చెప్పారు. ‘రాష్ట్రంలోకి ప్రవేశించిన ఎనిమిది మంది ఒమిక్రాన్‌ బాధితులతో కాంటాక్టు అయిన 21 మందిని గుర్తిస్తున్నాం. టోలీచౌక్‌లోని సంబంధిత కాలనీలో ఒకరోజు 511 పరీక్షలు చేశాం’ అని శ్రీనివాసరావు వివరించారు. 

మరిన్ని వార్తలు