సత్పతీ... సలామ్‌!

24 Jul, 2020 13:53 IST|Sakshi
కమిషనర్‌ సత్పతి

కార్మికుల సంక్షేమానికి రూ.20లక్షల ప్రత్యేక నిధి

స్నేహితుల సాయంతో ఏర్పాటు చేసిన 

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి

సిబ్బందిని ఆదుకునేందుకు వెచ్చిస్తున్న వైనం

వరంగల్‌ అర్బన్‌ :కొందరు అధికారులు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారు.. మరికొందరు పనిచేస్తూ, చేయిస్తూనే కింది స్థాయి సిబ్బంది శ్రేయస్సు కోసం కృషి చేసి వారిపై చెరగని ముద్ర వేస్తారు. ఆ కోవలోకే వస్తారు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌ పమేలా సత్పతి! బల్దియా సిబ్బంది కార్మికుల సంక్షేమానికి తన స్నేహితుల ద్వారా రూ.20లక్షలు సేకరించి ప్రత్యేక ని«ధిగా ఏర్పాటుచేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆమె మనసున్న మహారాణిలా నిలుస్తున్నారు. రూ.వెయ్యి ఇస్తేనే ఫొటోలు పేపర్లలో వేయించుకునే వారు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భారీ మొత్తాన్ని సాయమందించేందుకు వెచ్చిస్తున్న ఆమెపై బల్దియా ఉద్యోగులు, సిబ్బంది నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

సిబ్బంది సేవలు వెలకట్టలేనివి
వరంగల్‌లోని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వివిధ విభాగాల సిబ్బంది, కార్మికులకు కమిషనర్‌ పమేలా సత్పతి గురువారం ప్రశంసాపత్రాలు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ భయంకర కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. కార్మికుల ఆరోగ్యం, శ్రమను దృష్టిలో పెట్టుకుని తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వ్యక్తిగతంగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విధినిర్వహణలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడంలో ఆలస్యమైనా ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.11లక్షలను ఆపదలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు సహాయార్థం ఖర్చు చేయగా మరో రూ.9లక్షలు నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

అయితే, అకారణంగా విధులను గైర్హాజరు కావొద్దని, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు విధి నిర్వహణ కూడా ముఖ్య మని గుర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ విద్యాసాగర్, ఇన్‌చార్జ్‌ ఎంహెచ్‌ఓ జీ.వీ. నారాయణరావు, సెక్రటరీ విజయలక్ష్మి, సీహెచ్‌ఓ సునీత, డిప్యూటీ కమిషనర్‌ గోధుమల రాజు, టీఓ శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజారోగ్య విభాగానికి చెందిన కార్మికులు మాదాసి కరుణాకర్, సంజీవ్, మల్లికార్జున్, బాబు, విజయ, సారయ్య, జవాన్లు సతీష్, సాంబయ్య, ఫీల్డ్‌ వర్కర్‌ ఆనంద్‌తో పాటు డీఆర్‌ఎఫ్‌ నుంచి సాయికుమార్, మాలి సురేష్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ లింగనాథ్, కార్మికులు చందన్, లైన్‌మెన్‌ కరుణాకర్, హెల్పర్‌ సదానందం, బిల్‌ కలెక్టర్లు మొయిన్‌ పాషా, అటెండర్‌ సుజాతకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాన్ని అందశారు.

మరిన్ని వార్తలు