ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి

20 Aug, 2023 06:01 IST|Sakshi

హైకోర్టులో కేంద్రాన్ని ప్రారంభించిన సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే 

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు.

రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్‌కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయ­మూ­ర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్‌ కాపీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్‌ సర్విస్‌లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్‌ అపాయింట్‌మెంట్‌ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్‌ కోసం, ట్రాఫిక్‌ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. 


సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్‌ శ్యామ్‌ కోషి, జస్టిస్‌ వినోద్‌కుమార్, జస్టిస్‌ సుధీర్‌కుమార్, జస్టిస్‌ సాంబశివరావు నాయుడు, జస్టిస్‌ పుల్ల కార్తీక్, జస్టిస్‌ శరత్, జస్టిస్‌ రాజేశ్వర్‌రావు, జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ లక్ష్మీనారాయణ తదితరులు 

మరిన్ని వార్తలు