48 వాయిదాల్లో బకాయిల చెల్లింపు!

26 May, 2022 01:42 IST|Sakshi

డిస్కంలకు వెసులుబాటు కల్పిస్తూ త్వరలో కేంద్రం కొత్త పథకం 

తదుపరి అపరాధ రుసుం లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశం 

దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు రూ.లక్ష కోట్లకు పైనే బకాయి పడిన డిస్కంలు 

అపరాధ రుసుం మరో రూ.6,839 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుదుత్పత్తి కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిపడిన రూ.వేల కోట్లను సులభ వాయిదాల్లో చెల్లించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని ప్రకటించబోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న డిస్కంలు ఈ నెల 18 నాటికి విద్యుదుత్పత్తి కంపెనీలకు ఏకంగా రూ.1,00,018 కోట్ల బకాయిలు, నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయనందుకు మరో రూ.6,839 కోట్ల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంది. తెలంగాణ డిస్కంలు రూ.7,828 కోట్లు, ఏపీ డిస్కంలు రూ.9,983 కోట్ల బకాయి ఉన్నాయి. డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయకపోవడంతో విద్యుత్‌ రంగంలోని వివిధ విభాగాల మధ్య నగదు ప్రవాహం స్తంభించి మొత్తం రంగంపై దుష్ప్రభావం పడుతోంది. బొగ్గు కొనుగోళ్లకు, నిర్వహణ పెట్టుబడికి నిధుల కొరతతో విద్యుదుత్పత్తి కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుల్లో డిస్కంల ఇబ్బందులను తొలగించడానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రకటించింది.  

తప్పనున్న 19,833 కోట్ల ‘అపరాధ భారం’ 
ఈ పథకాన్ని ప్రకటించిన తేదీ నాటికి ఉన్న బకాయిల (అపరాధ రుసుముతో సహా) మొత్తంపై తదు పరిగా అపరాధ రుసుము విధించకుండా స్తంభింపజేస్తారు. మొత్తం బకాయిలను 48 వాయిదాల్లో చెల్లించడానికి వెసులుబాటు కల్పించనున్నారు. ఒకవేళ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే మాత్రం మినహాయించబడిన మొత్తం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఒకే పర్యాయం (వన్‌ టైం) అమలు చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా డిస్కంలతో పాటు విద్యుదుత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగు అవుతాయని కేంద్రం పేర్కొంటోంది. ఈ పథకంతో 48 నెలల్లో డిస్కంలపై రూ.19,833 కోట్ల అపరాధ రుసుం భారం తప్పనుంది. భారీగా బకాయిలున్న తమిళనాడు, మహారాష్ట్ర, డిస్కంలు చెరో రూ.4,500 కోట్లు, ఉత్తరప్రదేశ్‌ డిస్కంలు రూ.2,500 కోట్లు, ఏపీ, తెలంగాణ డిస్కంలు రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల అపరాధ రుసుం చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నాయి. దీంతో ఈ మేరకు విద్యుత్‌ చార్జీల పెంపు భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించనుంది.  

అపరాధ రుసుం ఇలా..: గడువులోగా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించకపోతే ఎస్‌బీఐ రుణాల కనీస వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకుని మొదటి నెల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా జాప్యం జరిగితే ప్రతి నెలా 0.5% చొప్పున, ఎస్‌బీఐ కనీస వడ్డీ రేటుకు అదనంగా 3% వరకు అపరాధ రుసుం పెంచి చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి. బకాయిలపై అపరాధ∙రుసుములు రూ.వేల కోట్లకు పెరిగి డిస్కంలు ఆర్థికంగా కుదేలు కావడంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొస్తోంది.   

మరిన్ని వార్తలు