చరిత్రపై చెరగని ‘సంతకం’

1 Sep, 2020 01:21 IST|Sakshi
హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, అప్పటి గవర్నర్‌ నరసింహన్‌తో ప్రణబ్‌ ముఖర్జీ (ఫైల్‌) 

∙రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై 2014 మార్చి ఒకటిన సంతకం 

∙మార్చి 2న గెజిట్‌ నోటిఫికేషన్‌ 

∙జీవితకాల లక్ష్యాన్ని 15 ఏళ్లలో సాధించారని కేసీఆర్‌కు ప్రశంసలు 

∙ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్‌.. ప్రణబ్‌కు పాదాభివందనం 

∙సీఎం అయ్యాక సైతం ప్రణబ్‌ పట్ల కృతజ్ఞతాభావం చూపిన కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కల సాకారం దిశగా అప్పటి రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ చేసిన సంతకం చరిత్రలో నిలిచిపోయింది. అరవైఏళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని అన్ని కోణాల నుంచి చూసిన ప్రణబ్‌ కేంద్ర మంత్రిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీకి నాయకత్వం వహించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు–2014పై మార్చి ఒకటిన ప్రణబ్‌ దాదా సంతకం చేశారు. ఆయన సంతకం చేసిన మరుసటిరోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆయన పెట్టిన సంతకం మేరకే జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.  

అన్నింటికీ సాక్షి.. 
యూపీఏ–2 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్‌ అనేకమార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన చర్చోపచర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్‌–9న వచ్చిన తొలి ప్రకటన సమయంలోనూ ప్రణబ్‌ కీలకంగా వ్యవహరించారు. అప్పటి ముఖ్యనేతలు ప్రణబ్‌తోపాటు చిదంబరం, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్‌ల సూచనల మేరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఆ ప్రకటనపై సీమాంధ్ర నుంచి వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్రం వెనుకంజ వేసినా, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల అభిప్రాయాల సేకరణలో ఆర్థికమంత్రిగా ప్రణబ్‌ కీలకంగా వ్యవహరించారు. స్థితప్రజ్ఞుడిగా పేరొందిన ప్రణబ్‌ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు చేయకున్నా, వారి మనోభావాలు తీవ్రంగా ఉన్నాయని చాలాసార్లు వ్యాఖ్యానించారు. 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక సైతం అనేకమార్లు తెలంగాణ ఏర్పాటుపై వచ్చిన వినతులకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు–2014 ఆమోదం పొందిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తీరును ఎండగడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. పార్లమెంట్‌ నిబంధనలు, ప్రక్రియలను పూర్తిగా ఉల్లంఘించి బిల్లును ఆమోదించారని, ఈ దృష్ట్యా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. మరికొన్ని పార్టీల ఎంపీలు సైతం ఇదేరీతిన ప్రణబ్‌ను కలిసి ఫిర్యాదు చేసినా రాజ్యసభకు బిల్లు రాకుండా ఆయన అడ్డుపడలేదు.  

‘ది కొయలిషన్‌ ఇయర్స్‌’ పుస్తకంలోనూ... 
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ను ప్రగతిశీల నగరంగా అభివృద్ధి చేసుకోండి, పెట్టుబడులను ఆకర్షించి ఉన్నత లక్ష్యాలను చేరుకోండి’అని ప్రణబ్‌ సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం హైదరాబాద్‌లో విడిది చేసేందుకు ప్రణబ్‌ వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్‌ వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి సాదర స్వాగతం పలుకుతూ వచ్చారు. ఇక 2017లో ప్రణబ్‌ రాసిన పుస్తకం ‘ది కొయలిషన్‌ ఇయర్స్‌’పుస్తకంలోనూ తెలంగాణ, కేసీఆర్‌ అంశాలను ప్రణబ్‌ ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వంలో చేరాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను కోరగా, ‘మాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యం. మీరు కేంద్ర పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా.. మా తెలంగాణ ప్రజల ఆకాంక్షను మాత్రం నెరవేర్చండి’అని అన్నారని ప్రణబ్‌ ఆ పుస్తకంలో ప్రశంసించారు. చదవండి: ప్రణబ్‌దా.. అల్విదా

కేసీఆర్‌కు ప్రశంసలు.. ప్రజా ఉద్యమానికి జోహార్లు..
2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం, 24న ఇప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రణబ్‌ని కలిశారు. కృతజ్ఞతాపూర్వకంగా ప్రణబ్‌ ముఖర్జీకి పాదాభివందనం చేస్తూనే తీవ్ర ఉద్వేగానికి లోనైన కేసీఆర్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ చేసిన వ్యాఖ్యలు, బంగారు తెలంగాణ అభివృద్ధికి అందిస్తామన్న సహకారం మరువలేనిది. ఇదే సందర్భంలో కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఎంతోమంది తమ జీవితకాలంలో సాధించలేని లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు. జీవితకాలం పట్టే లక్ష్యాన్ని మీరు 15 ఏళ్లలో సాధించారు. మీకు కృతజ్ఞతలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ సుదీర్ఘ పోరాటం, నిబద్ధత, కృషి అభినందనీయం. అలుపెరగని పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు’అని ప్రణబ్‌ కొనియాడారు. 

మరిన్ని వార్తలు