ఆసుపత్రి నుంచి గర్భిణి అదృశ్యం.. ‘నాకోసం వెతక్కండి’

25 May, 2021 11:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చాదర్‌ఘాట్‌: వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి అదృశ్యమైన ఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపిన వివరాలు.. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన గర్భిణి నసీరున్నీసా బేగం తన వదినతో కలిసి సోమవారం మలక్‌పేట ఏరియా ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చింది. ఆమె వదిన డాక్టర్లు ఉన్నారో లేరో తెలుసుకునేందుకు లోనికి వెళ్లి రాగా నసీరున్నీసా కనపడలేదు.

ఇంటి వద్ద ఇతర బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోవటంతో ఆమె కుటుంబ సభ్యులు చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి నుంచి వారి బంధువైన యువకుడితో ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఆమె తన భర్త సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపింది. తాను క్షేమంగానే ఉన్నానని, ప్రస్తుతం తాను మహబూబ్‌నగర్‌లో ఉన్నానని తన గురించి వెతకొద్దని అందులో పేర్కొంది. దీంతో ఆమె ఉద్దేశపూర్వకంగానే వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

గృహిణి అదృశ్యం 
పహాడీషరీఫ్‌: కూరగాయలు కొనుగోలుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన సంఘటన పహాడీషరీఫ్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. ఏఎస్సై నరోత్తం రెడ్డి తెలిపిన వివరాలు.. కర్నాటక బీదర్‌కు చెందిన జాదవ్‌ నాందేవ్, కవిత (24) దంపతులు. జీవనోపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం జల్‌పల్లి శ్రీరాం కాలనీకి వీరు వలసవచ్చారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు కూరగాయలు కొనుగోలు చేస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమె ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్‌ స్టేషన్‌లో గాని 94906 17241 నంబర్‌లో గాని సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.  

చదవండి: లాక్‌డౌన్‌.. నన్నే బయటకు వెళ్లనివ్వవా?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు