చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్‌ 

8 Jan, 2023 20:59 IST|Sakshi
ప్రిన్సిపాల్‌ కొట్టిన దెబ్బలు చూపిస్తున్న తల్లి కవిత

సాక్షి, హనుమకొండ: సెల్‌ఫోన్‌ చోరీ చేశావంటూ ఓ విద్యార్థిపై నిందమోసి చితకబాదాడొక ప్రిన్సిపాల్‌. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభాపూలే బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనమిది. కమలాపూర్‌ మండలం అంబాలకు చెందిన మాట్ల విష్ణు కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

గత ఏడాది దసరా సెలవులకు ముందు పాఠశాలలోని ఓ వంట మనిషి సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. అది ఎవరు దొంగిలించారో తెలియకపోయినా.. నేరాన్ని విద్యార్థులు యాకూబ్, విష్ణుపై ప్రిన్సిపాల్‌ పింగిలి వెంకటరమణారెడ్డి మోపారు. క్రిస్మస్‌ సెలవులకు ముందు ఇద్దరిని సుమారు పదిరోజుల పాటు సస్పెండ్‌ చేశారు. క్రిస్మస్‌ సెలవుల ఆనంతరం గురువారం విష్ణుతోపాటు మరో విద్యార్థి పాఠశాలకు రాగా.. పాఠశాలకు ఎందుకు వచ్చారంటూ ప్రిన్సిపాల్‌ మండిపడ్డారు. అదే పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న విష్ణు తల్లి కవితను పిలిపించి.. ‘మీ అబ్బాయి సెల్‌ఫోన్‌ దొంగతనం చేశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, టీసీ తీసుకొని వెళ్లిపోండని’.. ఆదేశించారు.

చదవండి: (భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..)

తన కొడుకు అలాంటి వాడు కాదని, దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రిన్సిపాల్‌.. ఆమె ఎదుటే విష్ణును గొడ్డును బాదినట్టు బాదారు. చోరీకి గురైన సెల్‌ఫోన్‌ డబ్బు ఇస్తామని తమతో ప్రిన్సిపాల్‌ ఒప్పంద పత్రం రాయించుకున్నారని, విష్ణును కొట్టిన విషయం బయటకు చెబితే స్వీపర్‌ పనినుంచి తీయించేస్తానని బెదిరించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేయని నేరానికి దెబ్బలు తినాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన విష్ణు చనిపోతాననడంతో ఆందోళన చెందిన కవిత ఇంటి వద్ద బిడ్డకు కాపలా కాస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ విద్యార్థి విష్ణును పాఠశాలకు పిలిపించుకుని ‘తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని.. దొంగతనం చేసింది నువ్వు కాదని తెలిసిందని.. నిన్ను కొట్టినందుకు సారీ’.. అని క్షమాపణ చెప్పారు. విషయం తెలిసిన ఎన్‌ఎస్‌యూఐ, దళిత సంఘాల నేతలు శుక్రవారం విష్ణు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో విచారణకు వచ్చిన జిల్లా కన్వీనర్‌ మనోహర్‌రెడ్డిని నిలదీశారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటనపై ఆర్సీవో ఆదేశాల మేరకు విచారణ జరిపానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మనోహర్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు