కాంగ్రెస్‌లోకి ఓయూ, కేయూ విద్యార్థి నేతలు

6 Nov, 2023 03:00 IST|Sakshi

నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఇతర ప్రజాప్రతినిధులు కూడా..

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన పలు విద్యార్థి సంఘాల నేతలు, పలువురు పరిశోధక విద్యార్థులు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేత కోట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సతీశ్, ఎస్‌ఎఫ్‌ఐ ఉస్మానియా వర్సిటీ విభాగం మాజీ అధ్యక్షుడు ఇ.రవి, టీవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మో హన్‌రాజ్, టీవీఎస్‌ కాకతీయ వర్సిటీ నేత కె.రంజిత్, టీఎస్‌పీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ ఓ.చంద్రశేఖర్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

కాగా, నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆంజనేయులుగౌడ్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఇప్పటికే గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య పార్టీలో చేరగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మరో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు వనజ తెలిపారు.

సోమవారం సీఎం కేసీఆర్‌ మక్తల్‌ ప్రజాఆశీర్వాద సభకు వస్తున్న తరుణంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బీఆర్‌ఎస్‌ను వీడటం గమనార్హం. వీరితోపాటు మక్తల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, బీజేపీ మైనార్టీ సెల్‌ నేతలు కూడా పార్టీలో చేరారు. కొడంగల్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సికింద్రాబాద్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు.   

మరిన్ని వార్తలు