ఆకట్టుకుంటున్న ‘మెనీ ఫేసెస్‌ ఆఫ్‌ ఎ మాస్టర్‌’

12 Feb, 2021 11:55 IST|Sakshi
ప్రధానిగా ప్రమాణం చేస్తున్న పీవీ నరసింహారావు (ఫైల్‌)

సాక్షి, మాదాపూర్‌:  తెలంగాణ ముద్దుబిడ్డ... బహుముఖ ప్రజ్ఞాశాలి.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా భాషా సంస్కృతి శాఖ, ఆర్ట్‌గ్యాలరీ సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్‌ చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ‘మెనీ ఫేసెస్‌ ఆఫ్‌ ఎ మాస్టర్‌’ ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీవీకి సంబంధించిన దాదాపు 250లకు పైగా చిత్రాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఇవి ఆయన రాజకీయ జీవితంలోని ప్రధాన ఘటనలను గుర్తుకు తెస్తున్నాయి. యువత ఈ చిత్రాలను తిలకించి పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిబిషన్‌కు క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్న పీవీ కుమార్తె ఎస్‌.వాణిదేవి ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ‘సాక్షి’కి వివరించారు. 

దేశం కోసం పరితపించేవారు.. 
మా నాన్నగారు ప్రతిక్షణం దేశ కోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం పరితపించేవారు. 1957లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. భారత ఆరి్థక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు భీజం వేసి, కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించారు. నాన్నగారు మితభాషి. బహుభాషా కోవిదుడు.గొప్ప రచయిత. ఇంగ్లీసు, హిందీతో పాటు దక్షిణాది భాషలు మొత్తం 17 అనర్గళంగా మాట్లాడేవారు.  నాన్నగారి జీవిత విశేషాలు అందరికీ తెలియజేసి స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాం.   – ఎస్‌.వాణిదేవి పీవీ కుమార్తె 

ఇందిరాగాంధీతో పీవీ (ఫైల్‌)

ప్రదర్శన వేళలు... 
ఈనెల 16వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.. 
చదవండి: అక్కడ చెట్టూ పుట్టా పీవీ జ్ఞాపకాలే!
పైసలిస్తారా.. ఫిర్యాదు చేయాలా..?

మరిన్ని వార్తలు