ప్రజల్ని కలుస్తూ.. సమస్యలు వింటూ..

8 Nov, 2022 00:36 IST|Sakshi

రాష్ట్రంలో ముగిసిన రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’

తెలంగాణలో 12 రోజులపాటు సాగిన పాదయాత్ర

375 కిలోమీటర్ల మేర నడిచిన కాంగ్రెస్‌ అగ్రనేత

అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిన రాహుల్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ ఐక్యత, సమగ్రతే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో సోమవారంతో ముగిసింది. గత నెల 23న రాష్ట్రంలోకి ప్రవేశించిన రాహుల్‌... 12 రోజు­లపాటు 375 కిలోమీటర్ల మేర నడి­చారు. మొత్తం 8 జిల్లాలు, 7 లోక్‌సభ స్థానా­లు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేశారు. సోమవారం రాత్రి రాహుల్‌ మహారాష్ట్రలోకి ప్రవేశించేసరికి ఆయన యాత్ర చేపట్టి 60 రోజులు పూర్తయింది.

ఆప్యాయత, ఉత్సాహాన్ని జోడించి..
రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాదయాత్ర కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్సాహరిచే విధంగా సాగింది. కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలోని గూడేబ­ల్లూరు గ్రామ సరిహద్దులో కృష్ణా నది వంతెనపై యాత్ర ప్రారంభమైన నాటి నుంచి రాహుల్‌ ఉల్లాసంగా ముందుకు సాగారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనతో కలసి నడిచారు.

ప్రజలను కలుస్తూ వారి సమస్య­లు వింటూ ముందుకు కదిలారు. భోజన విరామ సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా యాత్రలో ప్రదర్శించిన కళారూపాలను ఆస్వాదించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబా­ద్‌లోకి ప్రవేశించిన రాహుల్‌.. చారిత్రక కట్టడమైన చార్మినార్‌ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తన తండ్రి రాజీవ్‌ గాంధీ గతంలో చేపట్టిన సద్భావన యాత్రను గుర్తుకు తెచ్చారు.

ఆ తర్వాత నాయనమ్మ ఇందిరాగాంధీ విగ్రహం సాక్షిగా నెక్లెస్‌రోడ్డులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్‌ నుంచి సంగారెడ్డి జిల్లాలోకి భారీ జనసందోహంతో యాత్ర ప్రవేశించగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆంథోల్, జుక్కల్‌ నియోజకవర్గాల్లోనూ ఉత్సాహంగా సాగిన యాత్ర.. మేనూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభతో ముగిసింది. రాష్ట్ర సరిహద్దులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ నానా పటోలేకు త్రివర్ణ పతాకాన్ని అప్పగించారు. డగ్లేర్‌ ప్రాంతంలో రాహుల్‌ యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై విమర్శనాస్త్రాలు..
షెడ్యూల్‌ ప్రకారం 16 రోజుల పాటు తెలంగాణలో భారత్‌ జోడో యాత్ర జరగ్గా, నాలుగు రోజుల విరామం తీసుకున్న రాహుల్‌గాంధీ 12 రోజుల పాటు నడిచి 10 కార్నర్‌ మీటింగ్‌లలో ప్రసంగించారు. మేనూరు వద్ద ఏర్పాటు చేసిన వీడ్కోలు బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు. రాహుల్‌ ప్రసంగాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను లక్ష్యంగా చేసుకొనే సాగాయి.

జాతీయ స్థాయిలో బీజేపీ మతం పేరుతో ప్రేరేపిస్తున్న విద్వేషం గురించి, దేశాన్ని వేళ్లమీద లెక్కపెట్టగలిగినంత మంది బడా వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్న విధానం, ప్రైవేటీకరణ గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటోందని, అవినీతికి పాల్పడుతోందని, అన్ని అంశాల్లో బీజేపీకి మద్దతిస్తోందని, ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని కూడా చెప్పుకొచ్చారు.

మోదీ, కేసీఆర్‌ల మధ్య డైరెక్ట్‌లైన్‌ ఉందని, వారు రోజూ మాట్లాడుకుంటారని చెప్పే ప్రయత్నం చేశారు. మేనూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో తెలంగాణ స్ఫూర్తిని సోదాహరణంగా వివరించిన రాహుల్‌ తెలంగాణ గొంతును ఎవరూ అణచలేరని, ఎవరైనా తెలంగాణ డిమాండ్లను వినాల్సిందేనని వెల్లడించారు. తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తితో అనేక అంశాలు నేర్చుకున్నానని చెప్పిన రాహుల్‌ తెలంగాణను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తన యాత్రలో భాగంగా చేసిన ప్రసంగాల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ శ్రేణుల్లో భరోసా కల్పించారు.

రాహుల్‌ పాదయాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, దిగ్విజయ్‌సింగ్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీనియర్లు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, టి. జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేశ్‌కుమార్‌గౌడ్, గాలి అనిల్‌కుమార్, జెట్టి కుసుమ కుమార్, బోరెడ్డి అయో«ధ్యరెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలతోపాటు అన్ని జిల్లాల పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.  

>
మరిన్ని వార్తలు