Regional Ring Road: ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. ఆ రెండు చోట్ల మాత్రం!

4 Oct, 2022 13:11 IST|Sakshi

భువనగిరి, సంగారెడ్డి ‘కాలా’ల్లో మాత్రం అడ్డుకున్న రైతులు

త్వరలో రైతులతో మంతనాలు.. కాదంటే పోలీసు బందోబస్తుమధ్య సర్వే!

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగు రోడ్డు ఉత్తర భా­గా­నికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ పూ­ర్తయింది. భూములిచ్చేది లేదంటూ రైతులు భీష్మించటంతో సంగారెడ్డి, రాయగిరి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అధికారులు సర్వే పూర్తి చేశారు. రో­డ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల వెడ­ల్పు­తో అలైన్‌­మెంట్‌ ప్రకారం హద్దులు నిర్ధారించారు. అలైన్‌­మెం­ట్‌ ప్రకారం జెండాలు కట్టిన కర్రలు పాతారు. సర్వే నంబర్ల వారీగా రైతుల సమక్షంలో వారి వివ­రా­లను రికార్డు చేశారు. 

ఆ రెండు చోట్ల తీవ్ర నిరసనలు..
రీజనల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియకు కోసం ఎనిమిది ‘కాలా’ (కాంపిటెంట్‌ అథారి టీస్‌ ఫర్‌ లాండ్‌ అక్విజిషన్‌) లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారులు అన్ని విభాగాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే భువనగిరి కాలాకు సంబంధించి సర్వే అసలు జరగలేదు. ఇక్కడ రైతులు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో పలు ప్రాజెక్టులకు భూమి ఇచ్చినందున మరోసారి భూమిని కోల్పేయే ప్రసక్తే లేదంటూ ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు.

అలాగే సంగారెడ్డి పట్టణం సమీపంలోని గ్రామాల రైతులు కూడా అధికారులను సర్వే చేయనివ్వలేదు. సంగారెడ్డిని దాదాపు ఆనుకుని ఉన్నందున తమ భూములకు ఎక్కువ ధర ఉందని, అయితే పరిహారం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున భూములు ఇవ్వబోమంటూ సర్వేను అడ్డుకున్నారు. భువనగిరి కాలా పరిధిలో 22 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే జరగలేదు. సంగారెడ్డి కాలా పరిధిలో 8 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి రైతులతో చర్చించి, సర్వే జరపాలని అధికారులు భావిస్తున్నారు. కుదరని పక్షంలో పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు