ఐబీసీ రికవరీలు తగ్గుతున్నాయి 

25 Nov, 2023 08:52 IST|Sakshi

ముంబై: దివాలా చట్టాన్ని (ఐబీసీ) ప్రవేశపెట్టిన తర్వాత రుణాల చెల్లింపు సంస్కృతి కొంత మెరుగుపడినప్పటికీ, గత కొన్నేళ్లుగా రికవరీలు క్రమంగా తగ్గుతున్నాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. పైగా పరిష్కారానికి పట్టే సమయం పెరిగిపోతోందని ఒక నివేదికలో పేర్కొంది. ఐబీసీ ప్రవేశపెట్టాక గత ఏడేళ్ల పరిస్థితి చూస్తే 2019 మార్చిలో 43 శాతంగా ఉన్న రికవరీల రేటు 2023 సెప్టెంబర్‌ నాటికి 32 శాతానికి పడిపోయిందని వివరించింది.

అదే సమయంలో పరిష్కార ప్రక్రియకు పట్టే సమయం సగటున 324 రోజుల నుంచి 653 రోజులకు పెరిగిందని పేర్కొంది. న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత, డిఫాల్ట్‌లను గుర్తించడంలో జాప్యం మొదలైన సమస్యలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని వివరించింది. సాధారణంగా ఐబీసీ కేసులు 330 రోజుల్లో పరిష్కారం కావాలి. గత ఏడేళ్లలో 808 కేసుల్లో చిక్కుకుపోయిన రూ. 3.16 లక్షల కోట్ల మొండిబాకీల సమస్య పరిష్కారానికి ఐబీసీ సహాయపడిందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మోహిత్‌ మఖీజా తెలిపారు.

ఐబీసీతో రుణ గ్రహీతల ప్రవర్తనలో గణనీయంగా మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు చేజారిపోతాయేమోనన్న భయాల కారణంగా ఐబీసీ వద్దకు రావడానికి ముందే రూ. 9 లక్షల కోట్ల పైచిలుకు మొండిబాకీల కేసులు పరిష్కారమైనట్లు మఖీజా చెప్పారు. ఐబీసీ ద్వారా గత ఏడేళ్లలో పరిష్కారమైన వాటితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని ఆయన పేర్కొన్నారు. గత చట్టాల కింద రుణాల రికవరీ రేటు సగటున 5–20 శాతంగానే ఉండేదని, వాటితో పోలిస్తే ఐబీసీ కింద పరిస్థితి మెరుగుపడిందని వివరించారు.  

మరిన్ని వార్తలు