అతివలకు అండగా సఖి

19 Nov, 2020 08:50 IST|Sakshi

వేధింపులకు గురైన మహిళలకు  సహాయం

 24 గంటలపాటు సేవలు

అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్‌ 181

ఆదిలాబాద్‌టౌన్‌: నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, యువతులపై దాడులు, వేధింపులు, గృహహింస, అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ‘సఖి’ సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తోంది. మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. తమపై దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేనివారు సఖి కేంద్రానికి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి సహాయాన్ని అందిస్తోంది. మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నారు. 

 2017లో సఖి కేంద్రం ఏర్పాటు
మహిళలకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 2017 డిసెంబర్‌ 16న సఖీ కేంద్రాన్ని  ప్రారంభించారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్‌తో పాటు సఖి కూడా సేవలు అందిస్తోంది. చిన్నపిల్లల నుంచి పండు ముసళ్ల వరకు సఖి కేంద్రం సమస్య పరిష్కరిస్తోంది. అత్తామామలు, భార్యాభర్తల గొడవలు, యువతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఐదురోజుల పాటు ఆశ్రయం కూడా కల్పిస్తోంది. లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, ఆడపిల్లల అమ్మకం, పనిచేసే చోట వేధింపులు, తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం జరిగేలా చేస్తోంది.

ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181
వేధింపులకు గురవుతున్న మహిళలకు    న్యాయం చేసేందుకు సఖి కేంద్రం సేవలు అందిస్తోంది. అందుల్చో భాగంగానే ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ పేరిట టోల్‌ఫ్రీ నంబర్‌ 181 ఏర్పాటు చేసింది. ఇబ్బందులు పడుతున్న మహిళలు టోల్‌ఫ్రీ నంబర్‌ 181కు సమాచారం అందిస్తే సహాయం అందిస్తోంది. ఎవరైనా అక్కడినుంచి రాలేని పరిస్థితిలో ఉంటే వారికోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకువస్తారు. 24 గంటల పాటు ఈ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు.

కేసుల పరిష్కారంలో ముందంజ
2017 నుంచి ఇప్పటివరకు 722 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 569 కేసులను పరిష్కరించగా 153 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 710 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 116 మందికి న్యాయసేవ, 85 మందికి వైద్య సహాయం, 54 మందికి పోలీసు సహాయం అందించారు. దాదాపు 70వేల మందికి అవగాహన కల్పించినట్లు సఖి కేంద్రం నిర్వాహకులు యశోద చెబుతున్నారు. ఈయేడాది 258 కేసులు నమోదు కాగా 170 కేసులు పరిష్కరించినట్లు ఆమె పేర్కొన్నారు.

విస్తృతంగా ప్రచారం
సఖీ కేంద్రం సభ్యులు అందిస్తున్న సేవలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, గ్రామాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సమైక్య సంఘాల సభ్యులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలను చైతన్య పరుస్తున్నారు. గ్రామాల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మహిళలకు తమ హక్కులతో పాటు తమను తాము ఏవిధంగా రక్షించుకోవాలనే అంశాల గురించి వివరిస్తున్నారు. 

సద్వినియోగం చేసుకోవాలి
వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. దాడులకు గురైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నాం. అవసరమైన వారికి కేంద్రంలో ఐదురోజుల పాటు వసతి కూడా కల్పిస్తాం. బాధితులను తీసుకురావడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చేశాం.
– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి, ఆదిలాబాద్‌  
 

మరిన్ని వార్తలు