ఈటలపై నిందలను ప్రజలు నమ్మడం లేదు 

24 Oct, 2021 01:54 IST|Sakshi

కేసులకు భయపడి బీజేపీలో చేరారనడం వాస్తవం కాదు 

ప్రజాబలం, బీజేపీ అండదండలతో ఆయన గెలుస్తారు 

దళితబంధును ఆపాలని మేం కోరలేదు 

‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వూ్యలో బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం వేసిన నిందలను ప్రజలెవరూ విశ్వసించడం లేదు. కేసులకు భయపడి ఆయన బీజేపీలో చేరాడనడంలో వాస్తవం లేదు. హుజూరాబాద్‌లో ఆయనకు ప్రజాబలం మెండుగా ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చేశారు. అదే ఆయనను గెలిపిస్తుంది.

గ్యాస్, పెట్రో ధరలు, దళితబంధు నిలుపుదలలో టీఆర్‌ఎస్‌ మాపై చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలే. రాబోయే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు’అని బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నిక నేపథ్యంలో ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు.  

సాక్షి: ఈటల రాజేందర్‌ ప్రచారానికి ప్రజల్లో స్పందన ఎలా ఉంది? 
జితేందర్‌: ఈటలకు హుజూరాబాద్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బడుగుల ప్రతినిధిగా ఆయనకు ఉన్న గుర్తింపు కలసివస్తోంది. ఇందుకు జనాల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే కారణం. 

సాక్షి: ఈ ఉపఎన్నికలో అటు వైపు మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేస్తున్నారు. మరి రాజేందర్‌ విజయంపై మీ పార్టీ ధీమాగా ఉందా? 
జితేందర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. గతంలో హుజూర్‌నగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో వారిచ్చిన హామీలేవీ నిలుపుకోలేదు. హుజూరాబాద్‌లో మౌలిక సదుపాయాలతో పాటు అన్నిరంగాల్లో రాజేందర్‌ చేసిన అభివృద్ధి చాలా బాగుంది. 

సాక్షి: కేసులకు భయపడే రాజేందర్‌ మీ పార్టీలో చేరారన్న ప్రచారంపై మీ స్పందనేంటి? 
జితేందర్‌: అసలు ప్రభుత్వం వేసినవి అన్నీ నిందలే. ఈటల సౌమ్యుడు. అందుకే, ఆయనను పార్టీలో చేర్చుకున్నాం. నియోజకవర్గ ప్రజలెవరూ కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన ఆరోపణలను నమ్మడం లేదు. 

సాక్షి: దళితబంధును మీపార్టీ వారే ఆపారన్న ఆరోపణలను మీరెలా తిప్పికొడతారు?  
జితేందర్‌: అవన్నీ అసత్యాలు. ప్రభుత్వం పథకం ప్రారంభించి రెండు నెలలు దాటుతోంది. ఇంతకాలం లబ్ధిదారుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో డబ్బులు ఎందుకు వేయలేదు. ఖాతాల్లో ఫ్రీజ్‌ అయిన డబ్బులను విడుదల చేయాలని మాత్రమే సీఈసీని మేం లేఖ ద్వారా కోరాం. 

సాక్షి: గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు మీకు ప్రతికూలంగా మారతాయన్న ఆందోళన ఉందా? 
జితేందర్‌: గ్యాస్, పెట్రోల్‌ అంతర్జాతీయ ధరల మీద ఆధారపడి ఉంటాయి. కేంద్రంతోపాటు రాష్ట్రాలూ పన్నులు వేస్తున్నాయి. ఆ నిధులను మేం రక్షణ, కేంద్ర పథకాలు, మౌళికసదుపాయాల కోసం వినియోగిస్తాం. వీళ్లు మాత్రం ఆ నిధులను కాళేశ్వరానికి మళ్లించి కమీషన్లు తీసుకుంటున్నారు.  

సాక్షి: రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు ఇవ్వడం లేదన్న విమర్శలపై మీరేమంటారు? 
జితేందర్‌: కరీంనగర్‌ రైల్వేలైన్, ఆర్వోబీలు, ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీల్లో సగం రాష్ట్రవాటా ఉండాలి. మా వంతు నిధులు మేం భరిస్తున్నాం. రాష్ట్రం ముందుకు రాకుండా మమ్మల్ని నిందించడం తగదు. 

సాక్షి: కేంద్ర వ్యవసాయ చట్టాలతో జమ్మికుంట, హుజూరాబాద్‌ మార్కెట్లు మూతబడతాయన్న టీఆర్‌ఎస్‌ ఆరోపణలపై ఏమంటారు? 
జితేందర్‌: రైతులంతా మా చట్టాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ముందు మీరు మార్కెట్లలో రైతుల నుంచి వసూలు చేసే సెస్‌ భారం తగ్గించాలని  కోరుతున్నాం. 

సాక్షి: గతంలో ఇక్కడ బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి గెలిస్తే అది ఎవరిబలం? 
జితేందర్‌: అది ఇద్దరి బలం. స్థానికంగా రాజేందర్‌కు తిరుగులేని ప్రజాదరణ ఉంది. అందులో అనుమానమేమీ లేదు. విజయం సాధిస్తే అందులో సింహభాగం ఈటలదే అవుతుంది. 

సాక్షి: రాజేందర్‌కు పార్టీలో కీలక నేతలు సరిగా సహకరించడం లేదన్న ఆరోపణలపై ఏమంటారు? 
జితేందర్‌: అవన్నీ సత్యదూరమైన మాటలు. ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్‌చార్జీలు ఐదున్నరనెలలుగా కష్టపడుతున్నారు. స్టార్‌ క్యాంపెయినర్లు, కేంద్రమంత్రులు కూడా ఈటల వెంట ఉన్నారు.  

సాక్షి: ఈ ఉప ఎన్నిక తరువాత ఈటల కాంగ్రెస్‌లోకి వెళతారన్న ప్రచారంపై ఏమంటారు? 
జితేందర్‌: ఈటల గెలిచాక. టీఆర్‌ఎస్సే వెళ్లి కాంగ్రెస్‌లో విలీనమవుతుంది.  

సాక్షి: దుబ్బాక, బల్దియా తరహాలో ప్రత్యేక వ్యూహాలేమైనా అనుసరిస్తున్నారా? 
జితేందర్‌: మాకు ఎలాంటి వ్యూహాలు లేవు. ప్రజల అండదండలే మాకు శ్రీరామ రక్ష. గతం కంటే భారీ మెజారిటీతో ఈటల గెలుస్తారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు