కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోట

15 Oct, 2020 10:50 IST|Sakshi

సాక్షి, జనగామ: శక్తివంతమైన మొఘల్‌ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన రాతి కోట కూలిపోయింది. గోల్కొండ సామ్రాజ్యంపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన పాపన్న.. తన విజయయాత్ర సాగించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో నిర్మించిన కోట గురువారం నేల మట్టమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో కోటలోని ఒకవైపు భాగం కూలిపోయింది. 20 అడుగుల ఎత్తు ఉన్న కోట గోడ మొత్తం కింద పడగా మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భారీ శబ్ధం రాగా, గ్రామస్తులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కోట పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇటీవలే రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు.   చదవండి: భారీ వర్షం.. క్షణాల్లో కుప్పకూలిన భవనం

పర్యవేక్షణ లేక లోపించిన నాణ్యత
ఖిలాషాపూర్‌ కోటను 17 మే 2017న చారిత్రక ప్రాంతంగా గుర్తించారు. టూరిజం స్పాట్‌గా ఎంపిక చేయడంతో పాటు కోట అభివృద్ధి కోసం రూ.4.50 కోట్ల నిధులను విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితమే నిధులు విడుదలైనా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొంతకాలానికి పనులు మొదలైనా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మమ అనిపించారు. పనులు నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంతలోనే కోట కూలిపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. చదవండి: ఎడతెగని వాన.. వందేళ్ల రికార్డు బ్రేక్‌

పాపన్న చరిత్ర ఇదీ
దక్కన్‌ పీఠ భూమిలోని గోల్కొండ రాజ్యం సిరి సంపదలతో వర్ధిల్లేది. సామ్రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ ప్రాంతంపై కన్నేసి దండయాత్రకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే క్రీ.శ.1687 లో గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. మొఘల్‌ పాలన క్రీ.శ.1687 నుంచి క్రీ.శ.1724 వరకు కొనసాగింది. మొఘల్‌ పాలకులు నియమించుకున్న సుబేదార్ల ఆగడాలతో గోల్కొండ రాజ్యంలో అరాచకం నెలకొన్నది. ప్రజలపై దోపిడీ, దాడు లు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయి సమాజంలో అశాంతి నెలకొనడంతో ప్రజలు తీవ్ర అణచివేతకు గురయ్యారు. గౌడ కులం లో జన్మించిన పాపన్న.. పాలకులు సాగిస్తున్న విధానాలను వ్యతిరేకంగా పోరాడారు. బలహీన వర్గాలను ఏకం చేస్తే గోల్కొండను స్వాధీనం చేసుకోవచ్చనే ఆశయంతో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.  

చెదిరిపోతున్న ఆనవాళ్లు
సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన రాతి కోట ఆనవాళ్లు కాలక్రమంలో చెదిరిపోతున్నాయి. మాజీ డీజీపీ పేర్వారం రాములు చొరవతో లండన్‌ మ్యూజియంలో ఉన్న పాపన్న ఫొటో ఆధారంగా ఖిలాషాపూర్‌ కోటను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా గ్రామంలో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పేర్వారం రాములు కోట అభివృద్ధి కోసం కృషి చేశారు. కానీ ప్రస్తుతం పట్టించుకునే నాథుడు లేక కోట రూపం మారిపోతోంది.  

ఖిలాషాపూర్‌లోనే తొలి కోట
ఈ క్రమంలోనే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో శత్రు దుర్బేధ్యంగా పూర్తిగా రాతితో ఈ కోటను నిర్మించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 20 అడుగుల ఎత్తులో రాతికోటను నిర్మించారు. నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. కోట లోపల సొరంగ మార్గాలు సైతం ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్‌ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న.. తొలికోటను ఖిలాషాపూర్‌లోనే నిర్మించినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. ఔరంగజేబు మరణం తర్వాత బలహీనపడిన మొఘల్‌ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్‌ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, చివరికి గోల్కొండను సైతం వశపర్చుకున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా