24 రోజుల తర్వాత తెరుచుకోనున్న విద్యాసంస్థలు

31 Jan, 2022 03:22 IST|Sakshi

గదులు, పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు 

శానిటైజేషన్‌ కోసం ప్రత్యేక బృందాలు 

ప్రతి జిల్లాలో పర్యవేక్షణ కమిటీలు

కోవిడ్‌ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలలు, కళాశాలలను మంగళవారం నుంచి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. విద్యాసంస్థలన్నీ ఏర్పాట్లు మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రైవేటు సంస్థలు చాలా వరకు ప్రత్యక్ష తరగతులకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలన్నింటా ఆది, సోమవారాల్లో వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.

ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటికీ తొలుత ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 31వ తేదీ వరకు కూడా తెరవొద్దని ఆదేశించింది. తాజాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తిరిగి తెరిచేందుకు అనుమతించింది. 

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా.. 
రాష్ట్రవ్యాప్తంగా 42,575 పాఠశాలలు ఉన్నాయి. అందులో 20,752 ప్రై మరీ, 7,471 అప్పర్‌ ప్రై మరీ, 11,921 సెకండరీ, 2,431 హయ్యర్‌ సెకండరీ పాఠశాలలు. మొత్తం స్కూళ్లలో దాదాపు 26 వేల వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిలో పరిశుభ్రత, జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్‌ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని శానిటైజేషన్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందుకోసం జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని, మండల స్థాయి కమిటీలు కూడా పనిచేస్తాయని చెప్పారు. స్థానిక పంచాయతీల సహకారంతో స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. గదులను పరిశుభ్రంగా ఉంచడం, శానిటైజర్లను అందుబాటులో ఉంచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలుచేస్తామని తెలిపారు.

వ్యక్తిగత శానిటైజర్లను అనుమతిస్తామని.. విద్యాసంస్థల్లోనూ ప్రత్యేకంగా ఈ సదుపాయం ఉంటుందని పాఠశాల విద్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మొదట ఓ వారం రోజుల వరకు 5వ తరగతిలోపు విద్యార్థుల హాజరు పెద్దగా ఉండకపోవచ్చని.. పై తరగతుల వారు యధావిధిగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

హాస్టళ్లలో ఆలస్యంగా.. 
హాస్టళ్లలో సమగ్ర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు హాస్టళ్లు తెరిచినా.. విద్యార్థుల శాతం పరిమితంగానే ఉంచే వీలుందని అంటున్నారు. దగ్గర్లోని విద్యార్థులను వారం రోజుల పాటు ఇళ్ల నుంచే స్కూలుకు వెళ్లాలని మౌఖిక ఆదేశాలివ్వాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. 

అర్హత ఉన్న విద్యార్థులకు వ్యాక్సిన్‌ 
సెలవు రోజుల్లో అర్హత ఉన్న విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ చేపట్టినట్టు అధికార వర్గాలు చెప్పాయి. దీనివల్ల టెన్త్‌ పరీక్షల నాటికి విద్యార్థుల్లో చాలావరకూ వ్యాధి నిరోధక శక్తి ఉండే వీలుందని పేర్కొన్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులకు ముందే వ్యాక్సినేషన్‌ చేపట్టామని.. వారికి పరీక్షల నాటికి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నామని వెల్లడించాయి. ఏదేమైనా ఇక నుంచి మిగిలిన విద్యా సంవత్సరమంతా బోధన ముమ్మరంగా సాగుతుందని అధ్యాపకవర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు