నేటినుంచి మళ్లీ బడులు 

26 Oct, 2023 02:56 IST|Sakshi

13 రోజుల తర్వాత పునః ప్రారంభం 

వెంటాడుతున్న ఎన్నికల వేడి 

పోలింగ్‌ శిక్షణలో ఉపాధ్యాయులు 

టెన్త్‌ సిలబస్‌పై దృష్టి పెట్టాలని ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి విజయదశమి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిలబస్‌ అనుకున్న మేర పూర్తవ్వలేదు. చాలా స్కూళ్లల్లో 40 శాతం సిలబస్‌ కూడా పూర్తవ్వలేదు. దీంతో ఎన్నికల లోపు సిలబస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సూచించింది.

రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది టీచర్లు పోలింగ్‌ విధులకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి శిక్షణ కూడా ఎన్నికల కమిషన్‌ పూర్తి చేసింది. ఇప్పుడు జిల్లాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అంటే మరో 15 రోజుల్లో ఉపాధ్యాయులు పూర్తిగా ఎన్నికల శిక్షణలోనే పెద్ద సంఖ్యలో పాల్గొనే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ పూర్తి చేసేందుకు కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యంగా టెన్త్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

పబ్లిక్‌ పరీక్షలు కావడంతో సిలబస్‌ కోసం అదనపు క్లాసులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత డిసెంబర్‌లో ఈ ప్రక్రియ చేపట్టే వీలుందని చెబుతున్నారు. దసరా వరకూ 70 శాతం సిలబస్‌ పూర్తవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని, మిగిలిన సిలబస్‌ను డిసెంబర్‌లో ప్రత్యేక క్లాసుల ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. 

దశల వారీగా అల్పాహారం.. 
ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి దసరా తర్వాత దీన్ని అమలు చేయాలని భావించినా, ఎన్నికల షెడ్యూల్డ్‌ వస్తుందని తెలియడంతో ముందే ప్రారంభించారు. పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళల్లో దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నారు. కానీ ఇందుకు అవసరమైన ప్రణాళిక పూర్తవ్వలేదని అధికారులు చెబుతున్నారు.

ప్రతీ స్కూలులో వంట సామాగ్రి, బడ్జెట్‌ అంశాలపై స్పష్టత లేదంటున్నారు. దీంతో తొలి రోజు మండలానికి ఒక స్కూల్‌లో సీఎం అల్పాహారం పథకం అమలు చేయాలనిఅధికారులు నిర్ణయించారు. ప్రతీ వారం ప్రతీమండలంలో ఒక్కో స్కూల్‌ చొప్పున, దశలవారీగా విస్తరించబోతున్నట్టు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు