గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్‌ 3 నుంచి సాధారణ సేవలు

28 Jul, 2021 21:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్‌ 3వ తేదీ నుంచి కోవిడ్‌తోపాటు సాధారణ వైద్యసేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. పలు విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వ హించిన అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఎనిమిది అంతస్తుల ఆస్పత్రి ప్రధాన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆర్థోపెడిక్‌ ఐసీయూలో కోవిడ్‌ ట్రైయాజ్‌ ఏరి యా, రెండు, మూడు అంతస్తుల్లో  కోవిడ్, నాల్గవ అంతస్తులో మ్యూకోర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ఫంగస్‌) బాధితులకు కేటాయించినట్లు వివరించారు. 

కోవిడ్‌కు 40 శాతం, నాన్‌కోవిడ్‌కు 60 శాతం వైద్యులు, సిబ్బందిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశామని, ఎమర్జెన్సీ, సాధారణ, ఓపీ సేవలు గతంలో మాదిరిగానే అందుబాటులో ఉంటాయని తెలిపారు. కోవిడ్‌ కారణంగా 110 రోజుల తర్వాత ఇక్కడ సాధారణ వైద్యం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. గాంధీఆస్పత్రిలో 153 బ్లాక్‌ఫంగస్, 219 కోవిడ్‌ రోగులకు ప్రస్తుతం వైద్యసేవలు అందిస్తున్నామని నోడల్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు