‘టీఎస్‌పీఎస్సీ కేసు’లో సాక్షిగా శంకరలక్ష్మి

25 Mar, 2023 02:04 IST|Sakshi

రిమాండ్‌ రిపోర్ట్‌లో పొందుపరిచిన పోలీసులు 

నిందితుల అదనపు కస్టడీ కోరుతూ పిటిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కస్టోడియన్‌ బి.శంకరలక్ష్మి కీలక సాక్షిగా మారారు. తొలుత అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యాల అదనపు కస్టడీతోపాటు తాజాగా అరెస్టు చేసిన షమీమ్, సురేశ్,రమేశ్‌లను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్‌ అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేశారు.

టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పులిదిండి ప్రవీణ్‌ కుమార్, రాజశేఖర్‌రెడ్డి ఐదు పరీక్షలకు సంబంధించిన 11 ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కస్టోడియన్‌ అయిన శంకరలక్ష్మి కంప్యూటర్‌ నుంచే తస్కరించారు. ఈ వ్యవహరంలో ఆమె నిర్లక్ష్యం ఉందని అధికారులు ఇప్పటికే తేల్చడంతో చర్యలు కూడా తీసుకుంటారని ప్రచారం జరిగింది.

అయితే ఆమెను ఈ కేసులో రెండో సాక్షిగా పరిగణిస్తున్నట్లు కోర్టు దృష్టికి సిట్‌ తీసుకువెళ్లింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తూ దాఖలు చేసిన రిమాండ్‌ కేస్‌ డైరీలో ఈ విషయాలు పొందుపరిచింది. ఈ కేసులో వివరాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు అభియోగపత్రాలు దాఖలు చేయడానికి నిందితుల కస్టడీ అవసరమని పేర్కొంది. 

రాజశేఖర్‌ బంధువుకు నోటీసులు! 
న్యూజిలాండ్‌లో నివసిస్తూ గతేడాది గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌ వచ్చి వెళ్లిన కమిషన్‌ నెట్‌వర్క్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు ప్రశాంత్‌ను ప్రశ్నించాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అతనికి వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. అత డు విచారణకు రాకుంటే లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేయనున్నారు.

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష లీకేజీ కేసులో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మందిలో శుక్రవారం నాటికి 40 మంది విచారణ పూర్తయింది. ఏఈ పరీక్ష ప్రశ్న పత్రం విషయంలోనే క్రయవిక్రయాలు జరిగాయని, గ్రూప్‌– 1లో ఇలాంటివి జరిగినట్లు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని సిట్‌ అధికారులు చెబుతున్నారు. 

బండి సంజయ్‌ గైర్హాజరు... 
పరీక్ష పత్రాల లీకేజీ కేసుల్లో ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అందుకుతగ్గ ఆధారాలను శుక్రవారం తమ కార్యాలయానికి వచ్చి సమర్పించాలంటూ సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి సంజయ్‌ హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సైతం సిట్‌ నోటీసులు ఇవ్వగా ఆయన గురువారం సిట్‌ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు