ఎస్సై అనుచిత ప్రవర్తన!

14 Aug, 2020 08:01 IST|Sakshi
ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రాసిన లేఖ  

డీపీవోలో ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుడు 

సిరిసిల్లక్రైం: కోడి గుడ్లకోసం ఇంటిపక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లిన యువకుడిపై మాస్క్‌ ధరించలేదని కోనరావుపేట ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వంగళ భాస్కర్‌ వాపోయాడు. ఎస్సై తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి గురువారం సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయానికి రాగా అత్యవసర ఫిర్యాదులు మాత్రమే పరిశీలిస్తున్నట్లు సిబ్బంది తెలపడంతో మీడియాకు గోడు వెల్లబోసుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన రాత్రి 9.30 ఇంటి సమీపంలోని కిరాణంలో కోడిగుడ్ల కోసం వెళ్లగా అటుగా పెట్రోలింగ్‌కు వచ్చిన ఎస్సై మాస్క్‌ ధరించలేదని కేసు నమోదు చేస్తానని బెదిరించి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరుసటిరోజు ఠాణాకు వెళితే కోపోద్రిక్తుడైన ఎస్సై తిడుతూ..్ఙనేను నీ గురించి ఎంక్వైరీ చేశా. నీవు నీ భార్యను కొడతవటా..వెళ్లి నీ భార్యను తీసుకుని రాపో..నేను కౌన్సెలింగ్‌ చేశాక.. నీ ఫోన్‌ ఇస్తానని అన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. మా భార్యాభర్తల  విషయం మీకు అవసరం లేదని చెప్పినా వినకుండా నీ భార్యను తీసుకువస్తేనే ఫోన్‌ ఇస్తానని అన్నట్లు బాధితుడు వివరించాడు. రెండు గంటలపాటు ఠాణా ఆవరణలో నిలుచోబెట్టారని, ఇక మీద ఠాణా చుట్టూ నిన్ను తిప్పించుకుంటానని ఫోన్‌ ఇచ్చే సమయంలో అన్నట్లు తెలిపాడు. చిన్న తప్పిదానికి భయభ్రాంతులకు గురి చేసిన ఎస్సై నుంచి రక్షణ కల్పించాలని పోలీస్‌ ఉన్నతాధికారులను కోరేందుకు వచ్చినట్లు బాధితుడు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు