దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి

21 Jan, 2022 02:25 IST|Sakshi

గ్రామాల వారీగా సమగ్ర వివరాలు అడిగిన ప్రభుత్వం

నిర్దేశిత ఫార్మాట్‌లో కలెక్టర్లకు నివేదికలు పంపిన తహసీల్దార్లు

ప్రభుత్వ భూముల సాగు, సాదా బైనామాలు తదితర సమస్యల ప్రస్తావన

ఈ సమస్యలు పరిష్కరించాలంటే భూ చట్టాల్లో మార్పులు చేయాలంటున్న రెవెన్యూ వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏళ్ల తరబడి పరి ష్కారం కాకుండా పెండింగ్‌లో పడిపోయిన సమస్యల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్‌లో సమస్యల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గ్రామం, మండలం, సర్వే నంబర్, భూ విస్తీర్ణం,  సమస్య ఏంటి, పరిష్కారం ఎలా చేయాలి తదితర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు. దీంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు ఈ అంశంపై దృష్టి పెట్టి ప్రభుత్వం అడిగిన ఫార్మాట్‌లో నివేదికలను కలెక్టరేట్‌లకు పంపినట్టు సమాచారం. ఈ నివేదికల్లో పలు ఆసక్తికర భూ సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలు స్తోంది. అయితే వీటిల్లో అనేక సమస్యల పరిష్కారం అంత సులభంగా అయ్యే పని కాదని, భూ సంబంధిత చట్టాలు మార్చాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

చట్టాలు మారిస్తేనే పరిష్కారం
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంపై రెవెన్యూ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సమస్యలు పరి ష్కారం కావాలంటే చట్టాలు మార్చాల్సిం దేనని అంటున్నాయి. గత 20–30 ఏళ్లుగా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ భూముల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి ఆ ప్రభుత్వ భూమిని అధికారికంగా  కేటాయించేందుకు రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలు అనుమతించవని అంటున్నారు. అదే విధంగా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల లోపు భూములను అసైన్‌ చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని, ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఈ సమస్య మరింత జఠిలం అయిందని పేర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అసైన్డ్‌ చట్టంలో మార్పులు చేయాలని అభిప్రాయపడుతున్నాయి.

సమరయోధుల భూములూ చిక్కుముడులే..
     స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములపై జరిగిన క్రయవిక్రయ లావాదేవీల పరిష్కారం కూడా అంత సులభం కాదని తెలుస్తోంది. వాస్తవానికి స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్ల తర్వాత నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకుని అమ్ముకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఎలాంటి ఎన్‌వోసీలు లేకుండానే చాలాచోట్ల సబ్‌ రిజిస్ట్రార్లు ఈ భూములను నిర్దిష్ట గడువు తర్వాత ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారు. సేల్‌డీడ్‌లు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ భూములన్నీ ధరణి పోర్టల్‌లో ప్రభుత్వ భూములుగా కనబడుతున్నాయి. ఈ భూములకు ఎన్‌వోసీని కేవలం లబ్ధిదారుడైన స్వాతంత్య్ర సమరయోధుడు లేదా మాజీ సైనికుడి పేరిట ఇచ్చేందుకు మాత్రమే చట్టాలు అనుమతిస్తాయి. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం సేకరించిన పట్టా భూముల విస్తీర్ణాన్ని ఎడాపెడా నమోదు చేయడంతో చాలాచోట్ల సేకరించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణం ప్రభుత్వ ఖాతాలో జమ అయింది. ఇప్పుడు ఆ భూమిని పట్టాదారుకు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిని ఇతరులకు బదలాయించేందుకు అనుమతి ఉండదు. ఇలాంటి సమస్యలన్నీ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని తీర్చాలంటే చట్టాలు మార్చాలనేది రెవెన్యూ వర్గాల అభిప్రాయం. 

సాదా బైనామాల సంక్లిష్టత
    భూ సంబంధిత సమస్యల్లో ప్రధానమైనది సాదా బైనామాలు. తెల్ల కాగితాల ద్వారా జరిగిన క్రయ విక్రయాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనేకసార్లు దరఖాస్తులు  స్వీకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో తహశీల్దార్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా ధరణి పోర్టల్‌లో కొత్త సర్వే నంబర్ల నమోదు, పట్టాదారు పేరు మార్పు, విస్తీర్ణంలో తేడాల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు