ఊళ్లోనే పరిష్కారం.. దసరా తర్వాత ‘ధరణి’ సమస్యలపై స్పెషల్‌ డ్రైవ్‌ 

24 Sep, 2022 03:16 IST|Sakshi

గతంలో ప్రతిపాదించిన రెవెన్యూ సదస్సులను గ్రామస్థాయిలో చేపట్టే యోచన 

10 లక్షలు దాటిన ధరణి పోర్టల్‌ ఫిర్యాదులు 

సిబ్బంది లేమి, పరిష్కార వ్యవస్థలు లేకపోవడంతో ప్రభుత్వం ఊగిసలాట 

అక్టోబర్‌ రెండో వారంలో ధరణి పరిష్కార కార్యక్రమం ఉంటుందంటున్న ప్రభుత్వ వర్గాలు 

రెవెన్యూ సమస్యలు పరిష్కరించాకే సదస్సులు పెట్టాలంటున్న ఉద్యోగ సంఘాలు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎదు­ర్కొంటు­న్న ‘ధరణి’ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇంతకుముందు ప్రకటించిన రెవెన్యూ సదస్సులు కార్యరూపం దాల్చని నేపథ్యంలో.. నేరుగా గ్రామ, మండల స్థాయిలో స్పెషల్‌ డ్రైవ్‌లను చేపట్టాలని భావిస్తోంది.

ధరణికి సంబంధించి 10 లక్షలకుపైగా ఫిర్యాదులు రావడంతో.. వీటన్నింటినీ ఎలా పరిష్కరించాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. వచ్చే నెల (అక్టోబర్‌) రెండో వారంలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టంగానే చెప్తున్నా.. సిబ్బంది లేమి, క్షేత్రస్థాయిలో పరిష్కార వ్యవస్థలు లేకపోవడం వంటి అవరోధాలు కనిపిస్తున్నాయి. 

తొలి నుంచీ సమస్యలే.. 
రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయ, విక్రయ లావాదేవీలను పూర్తి పారదర్శకంగా జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ పోర్టల్‌లో భూముల వివరాల నమోదుకు అనుసరించిన విధానం, సాంకేతిక సమస్యలతో తలనొప్పులు మొదలయ్యాయి. భూమి విస్తీర్ణం నమోదు నుంచి నిషేధిత జాబితాలోని భూముల వరకు ఎన్నో సమస్యలు తలెత్తడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ధరణికి సంబంధించి ఏ చిన్న అంశాన్ని అయినా ఆన్‌లైన్‌లో పరిష్కరించే అవకాశం కేవలం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉండటం, ఆన్‌లైన్‌ దరఖాస్తులను వివిధ దశల్లో పరిశీలించడం క్లిష్టతరంగా మారడంతో ఫిర్యాదులు పేరుకుపోతూనే ఉన్నాయి. ధరణి పోర్టల్‌ గ్రీవెన్సులు (ఫిర్యాదులు) పది లక్షలు దాటాయని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. ఈ ఏడాది జూలై 5న ధరణిపై సమీక్షించిన సీఎం కేసీఆర్‌.. పది రోజుల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు.

కానీ ఇది అమల్లోకి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా.. కేవలం పైలట్‌ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా ములుగులో మాత్రమే రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తర్వాత విషయం అటకెక్కింది. తమ సమస్యలు పరిష్కరించాలని రైతుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ దీనిపై దృష్టిపెట్టింది. గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించాలని.. ఇందుకోసం దసరా తర్వాత ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించాలని యోచిస్తోంది. 

పుట్టెడు సమస్యలు.. పిడికెడు సిబ్బంది.. 
ధరణి పోర్టల్‌ సమస్యలకు గ్రామ స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని భూచట్టాల నిపుణులు కూడా చెప్తున్నారు. గ్రామ స్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకుని.. మండల, రెవెన్యూ డివిజన్ల స్థాయిలో వాటిని పరిశీలన జరపాలని, జిల్లా కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించేందుకు నిర్ణీత కాలవ్యవధి ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

అయితే ఈ ప్రక్రియలో సిబ్బంది కొరత అవరోధంగా మారే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వమే రద్దు చేయడం, ఉన్న వీఆర్‌ఏలు 60 రోజుల నుంచి సమ్మెలో ఉండటం, తహసీల్దార్లు తమ కార్యాలయాలను వదిలి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. క్షేత్రస్థాయిలో ధరణి ఫిర్యాదులను విచారించే వ్యవస్థ లేకుండా పోయిందని అంటున్నాయి. మరోవైపు రెవెన్యూ శాఖలో ఇప్పటికే పని ఒత్తిడి పెరిగిందని.. సిబ్బంది లేరని, పదోన్నతులు కల్పించడం లేదని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

ఈ సమస్యలన్నీ పరిష్కరించాకే.. ధరణి సదస్సులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక ధరణి సమస్యల పరిష్కారం జిల్లా కలెక్టర్ల చేతుల్లో ఉండటమూ ఇబ్బందిగా మారిందని.. కలెక్టర్లకు ఉండే పని ఒత్తిడి కారణంగా పరిష్కారంలో జాప్యం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సరైన ఏర్పాట్లు చేయకుండా ముందుకెళితే ‘ధరణి’ తేనెతుట్టెను కదిపినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

గ్రామస్థాయిలో ఎలా? 
సీఎం కేసీఆర్‌ మాత్రం ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దసరా తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ గ్రామస్థాయికి వెళుతుందా? వెళ్లినా దరఖాస్తుల స్వీకరణ వరకే పరిమితం అవుతుందా? అక్కడే పరిశీలన, పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందా? ప్రభుత్వం దీనిపై ఏ రూపంలో కార్యాచరణ తీసుకుంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు అంటున్నారు.   

మరిన్ని వార్తలు