అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం

8 Nov, 2023 05:26 IST|Sakshi

కృష్ణా ట్రిబ్యునల్‌ టీవోఆర్‌పై స్టే విధించాలన్న ఏపీ పిటిషన్‌ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణా ట్రిబ్యునల్‌–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాల (టీవోఆర్‌)ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్ర జల్‌ శక్తి శాఖ అక్టోబర్‌ 6న కృష్ణా ట్రిబ్యునల్‌–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాలపై తదుపరి చర్యలు లేకుండా నిలుపుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తూ.. జల వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం జల వివాదాల ట్రిబ్యునల్‌కే ఉందని, ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు ఆర్టికల్‌ 262 పరిధిలోకి వస్తాయన్నారు. ఆర్టికల్‌ 32 కింద కాకుండా ఆర్టికల్‌ 131 ప్రకారం పిటిషన్‌ దాఖలు చేయాల్సిందని వైద్యనాథన్‌ పేర్కొన్నారు. పిటిషన్‌కు మెయింటైన్‌బిలిటీ లేదంటూ అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు.

 ఈ పిటిషన్‌పై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాథమిక అభ్యంతరాలను కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొనాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ న్యాయవాది మెరిట్స్‌లోకి వెళ్తున్నారని, ఆ అవసరం లేదని, ట్రిబ్యునల్‌ టీవోఆర్‌పై స్టే విధించాలని కోరారు. ఈ సమయంలో కేంద్రం తరఫు న్యాయవాది వారం రోజులు గడువు ఇస్తే అభిప్రాయం చెబుతామని ధర్మాసనాన్ని కోరారు.

మెరిట్స్‌పై వాదించడానికి సిద్ధంగా ఉన్నామని, స్టే విధించొద్దని వైద్యనాథన్‌ కోరగా.. అయితే తాము కూడా మెరిట్స్‌పై వాదనకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ, కేంద్రం కౌంటర్‌ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్‌ కార్యకలాపాలు కొనసాగడం అనేది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ట్రిబ్యునల్‌ ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ నెల 29న చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు