మరో 3 బిల్లుల పరిష్కారం

25 Apr, 2023 05:49 IST|Sakshi

నిర్ణయాలు తీసుకున్న గవర్నర్‌  

రెండు బిల్లులు సర్కారుకు రిటర్న్‌.. ఒక బిల్లు తిరస్కృతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య విభేదాలతో రాజ్‌భవన్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన బిల్లుల వ్యవహారంలో మరికొంత కదలిక వచ్చింది. మొత్తం 10 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 7 బిల్లులపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించినట్టు ఈ నెల 10న సుప్రీంకోర్టుకు రాజ్‌భవన్‌ నివేదించింది. తాజాగా మిగిలిన 3 బిల్లులపై సైతం గవర్నర్‌  నిర్ణయాలు తీసుకుని పరిష్కరించారని సోమవారం వెల్లడించింది.

రాజ్‌భవన్‌ వర్గాల ప్రకారం.. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌ ఏన్యుయేషన్‌) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్‌ తిరస్కరించారు. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022తో పాటు  తెలంగాణ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు–2022పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరుతూ తిప్పి పంపారు.

ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో లేవని రాజ్‌భవన్‌ అధికారవర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు–2023 పై వివరణలు కోరుతూ గతంలోనే తిప్పి పంపడంతో.. ఈ విధంగా ప్రభుత్వానికి తిప్పి పంపిన బిల్లుల సంఖ్య మూడుకు పెరిగింది. 

కేవలం 3 బిల్లులకే ఆమోదం ..
తెలంగాణ మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లు–2022, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023, తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2023కు గవర్నర్‌ తమిళిసై ఈ నెల 9న ఆమోదం తెలిపారు. కీలకమైన తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు–2022, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లు–2022లను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపించారు. ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022 న్యాయశాఖ నుంచి చేరలేదని రాజ్‌భవన్‌ అధికారులు పేర్కొంటున్నారు.    

మరిన్ని వార్తలు