మెదక్‌ ఎంపీపై దాడి ఘటనపై గవర్నర్‌ సీరియస్‌, డీజీపీకి ఆదేశాలు

30 Oct, 2023 15:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమని తెలిపారు.

డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలి
ఎంపీపై హత్యాయత్నంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ స్పందించాలని గవర్నర్‌ కోరారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరమని తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

యశోద ఆసుపత్రికి కొత్త ప్రభాకర్‌ రెడ్డి
సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్‌ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ఎంపీని తీసుకొచ్చారు.

హత్యాయత్నం కేసు, నిందితుడి అరెస్ట్‌
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  కత్తితో దాడి చేసి, హత్య ప్రయత్నం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు  మిడిదొడ్డి మండలం పెద్ద చెప్పాల గ్రామానికి చెందిన గడ్డం రాజుగా గుర్తించారు. నిందితుని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసును సిద్ధిపేట సీపీ శ్వేత దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపీని కంటికి రెప్పలా కాపాడుకుంటాం: హరీష్‌రావు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు  తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్‌రెడ్డిపై  దాడి అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని, అధైర్య పడవద్దని సూచించారు.  ఎంపీని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.

ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హరీష్‌ రావు పేర్కొన్నారు. నారాయణఖేడ్‌ సభకు వెళ్తూ విషయం తెలియగానే ఆసుపత్రికి బయల్దేరారు హరీష్‌రావు. ఫోన్‌లో పరామర్శించి దైర్యం చెప్పారు. ఎంపీ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు