Telangana: రూ.786 కోట్లతో కొత్త పథకాలు 

18 Jan, 2022 03:29 IST|Sakshi

రూ.388.20 కోట్లతో మల్లన్నసాగర్‌ – తుపాస్‌పల్లి మధ్య లింక్‌ కాల్వ 

రూ.795.94 కోట్లకు చనాకా కొరాటా బ్యారేజీ అంచనాల పెంపు 

సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్‌ నిర్ణయాలు  

సాక్షి, హైదరాబాద్‌:  నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మొత్తం రూ.786 కోట్లతో పలు కొత్త పథకాలు, పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చనాకా కొరాటా బ్యారేజీతో పాటు నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాల అంచనా వ్యయం పెంపునకు సైతం అనుమతిచ్చింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్‌ ఈ కింది పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  

  • రూ.388.20 కోట్లతో సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌ జలాశయం నుండి తపాస్‌పల్లి జలాశయానికి లింక్‌ కాలువ తవ్వకానికి ఓకే. తపాస్‌పల్లిజలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనుంది.  
  • రూ.44.71 కోట్లతో వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామంలోని పెద్దచెరువు పునరుద్ధరణ. 
  • మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్‌పూర్‌ బ్రాంచి కాలువ పనులకు గాను రూ.144.43 కోట్ల మంజూరుకు ఆమోదం. ఈ కాలువ ద్వారా ఘన్‌పూర్, అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.  
  • ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాకా కొరాటా బ్యారేజీ అంచనా వ్యయాన్ని రూ.795.94 కోట్లకు సవరించడానికి ఓకే. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాగా, పంప్‌ హౌస్‌ నిర్మాణం కొనసాగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో భీమ్‌పూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్‌ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 
  • మెదక్‌ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్‌పూర్‌ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించారు. మిగిలిపోయిన పనులను రూ.50.32 కోట్లతో చేపట్టడానికి అనుమతి. మెదక్‌ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.  
  • రూ. 27.36 కోట్లతో వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్‌ డ్యాంల నిర్మాణానికి అనుమతి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు రూ.10.01 కోట్లు మంజూరు.  
  • గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ.669 కోట్లకు సవరించడానికి ఆమోదం. ప్రా జెక్టు పనులకు టెండర్లు పిలవడానికి అనుమతి. 

 మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు 

  • సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం కింద మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర. ఈ కార్పొరేషన్‌కు ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ/ప్రిన్సిపల్‌ సెక్రెటరీ చైర్మన్‌గా, ఈఎన్‌సీ (జనరల్‌), ఈఎన్‌సీ(గజ్వేల్‌), ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖల జాయింట్‌ సెక్రటరీలు, సంగారెడ్డి చీఫ్‌ ఇంజనీర్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.  
  • సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకంతో పాటు పాల్కేడ్‌ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్‌పహాడ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి మొత్తం రూ.16.23 కోట్లతో ఆమోదం. 
  • దేవాదుల పథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్‌ హౌస్, కాలువ పనులకు, గుండ్ల సాగర్‌ నుంచి లౌక్య తండా వరకు పైప్‌ లైన్‌ పనులకు, నశ్కల్‌ జలాశయం వద్ద పంప్‌ హౌస్‌ నిర్మాణానికి మొత్తం రూ.104.92 కోట్లతో ఆమోదం. 

మరిన్ని వార్తలు