డీపీఆర్‌లపై కదలిక

28 Aug, 2021 02:56 IST|Sakshi

సీఎం ఆదేశాలతో నివేదికల తయారీకి సిద్ధమైన ఇరిగేషన్‌ శాఖ 

10 ప్రధాన ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియకు సీఎం ఆదేశం 

నేటి నుంచి పని మొదలు పెట్టనున్న ఇంజనీర్లు 

అన్ని ప్రాజెక్టుల సీఈలతో స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, వాటికి కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందాలని అటు కేంద్రం, ఇటు బోర్డులు చెబుతున్న నేపథ్యంలో డీపీఆర్‌లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించింది. మూడు రోజుల కింద ఇంజనీర్లతో ç సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. డీపీఆర్‌ల తయారీపై దృష్టిపెట్టి అనుమతులు తెచ్చుకునే పనిని ఆరంభించాలని సూచించారు. దీంతో 10 ప్రధాన ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఇరిగేషన్‌ శాఖ కసరత్తు మొదలుపెట్టింది.  

ప్రధాన ప్రాజెక్టులు టార్గెట్‌... 
కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌లో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు మొదలైన నాటి నుంచే కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, అనుమతుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై పలుమార్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రభుత్వానికి లేఖలు రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రాగా డీపీఆర్‌లు ఇచ్చేందుకు తెలంగాణ సుముఖత తెలిపింది. ఇంతవరకు సమర్పించలేదు. కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోనూ కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ ఎత్తిపోతలు, జీఎల్‌ఐఎస్‌ ఫేజ్‌–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, రామప్ప సరç స్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు, పాల మూరు–రంగారెడ్డి, డిండి, మోడికుంటవాగు, తుమ్మిళ్ల ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం అనుమతులు లేవని పేర్కొంటూ.. ప్రాజెక్టులకు నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లో అనుమతులు పొందాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

వీటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పాలమూరు–రంగారెడ్డికి సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టించారు. మిగతా ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను సైతం మొదలుపెట్టేలా డీపీఆర్‌లను సిద్ధం చేయాలని, వాటిని కేంద్రానికి పంపి అనుమతులు పొందాలని సూచించారు. దీంతో ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ శుక్రవారం జలసౌధలో ప్రాజెక్టుల ఈఎన్‌సీలు, సీఈలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీపీఆర్‌ల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందుపరచాల్సిన అంశాలు, సేకరించాల్సిన వివరాలు తదితరాలపై మార్గదర్శనం చేశారు. శనివారం నుంచే డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. 

మరిన్ని వార్తలు