25న హరియాణాకు కేసీఆర్‌

20 Sep, 2022 02:53 IST|Sakshi

మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ జయంతి వేడుకలో పాల్గొననున్న సీఎం

కాంగ్రెస్‌ మినహా హాజరు కానున్న విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహలు ముమ్మరం చేసిన టీఆర్‌ ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ నెల 25న హరియాణా పర్యటనకు వెళ్లనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవీలాల్‌ 108వ జయంతి సందర్భంగా ఈ నెల 25న హరియాణాలో జరగనున్న సమ్మాన్‌ దివస్‌లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. దేవీలాల్‌ కుమారుడు, హరియాణా మాజీ సీఎం, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) అధినేత ఓంప్రకాశ్‌ చౌతాలా ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్‌ మినహా దేశంలోని వివిధ విపక్ష రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోపాటు కేసీఆర్‌ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. ఫతేబాద్‌  లో నిర్వహించే ఈ కార్యక్రమం విపక్షాల ఐక్యతను చాటేందుకు వేదికగా నిలుస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. జాతీయ పార్టీ స్థాపన కోసం సన్నాహాలు చేస్తున్న కేసీ ఆర్‌.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయే  తర పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేప థ్యంలో హరియాణాలో జరిగే దేవీలాల్‌ జ యంతి వేడుకలకు హాజరు కావాలని నిర్ణ యించుకున్నారు.

ఇటీవలి కాలంలో బిహార్‌ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో సమావేశమైన కేసీఆర్‌.. కర్ణాటక మాజీ సీఎం, జెడీఎస్‌ అధినేత కుమారస్వామి, గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సిన్హ్‌ వాఘేలాతోనూ భేటీ అయ్యారు. హరియాణా పర్యటనలో భాగంగా అక్కడి రైతు, దళిత సంఘాల ప్రతినిధులతోనూ కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశముంది. సీఎం పర్యటనకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు