చెప్పేదొకటి... చేసేదొకటి

13 Nov, 2022 00:53 IST|Sakshi

ధరణిలో మరో ట్విస్ట్‌

ఉత్తర్వుల్లో రాసిందొకటి... సీసీఎల్‌ఏ కార్యాలయంలో చేస్తున్నది మరొకటి

నిషేధిత భూముల జాబితా మార్పులు చేర్పులపై లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ

ఈనెల 3నే జారీ చేసిన సర్క్యులర్‌ను తాజాగా తహసీల్దార్లకు పంపిన సీసీఎల్‌ఏ

రంగారెడ్డి జిల్లాల్లోని కారిజ్‌ ఖాతా భూముల విషయంలో పలు అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత భూముల జాబితాలో మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రక్రియలో మౌఖికంగా చెప్పి మార్పులు చేయిస్తున్నారని, తద్వారా భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లిఖితపూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి.

అయితే, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం ఇచ్చిన ఈ ఆదేశాల సర్క్యులర్‌ను ఈనెల 3నే జారీ చేసినట్లు ఉన్నా, శనివారం ఉదయమే తహసీల్దార్లకు అందజేయడం గమనార్హం. కోర్టు కేసులు, భూసేకరణలో భాగంగా తీసుకున్న భూములు, అసైన్డ్, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్, ఇనాం భూముల విషయంలో ఏ నిబంధనలను ప్రాతిపదికగా తీసుకుని మార్పులు చేయాలో ఈ సర్క్యులర్‌లో వివరించారు. 

ఆచరణలో ఏదీ..
ఈ సర్క్యులర్‌లో రెవెన్యూ చట్టాలు చెబుతున్న నిబంధనలను ఉటంకించారే తప్ప ఆచరణలో వీటిని ఏమాత్రం పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సీసీఎల్‌ఏ కార్యాలయం వేదికగా వారంపాటు జరిగిన కసరత్తుకు, ఈ సర్క్యులర్‌లో పేర్కొన్న నిబంధనలకు తేడా ఉందని సాక్షాత్తు ఈ ప్రక్రియలో పాల్గొన్న తహసీల్దార్లే చెబుతున్నారు. ఇనాం భూముల విషయంలో స్వాధీన హక్కుల ధ్రువపత్ర (ఓఆర్‌సీ) రిజిస్టర్‌ను పరిశీలించాలని నిబంధనలు చెబుతుంటే, ఓఆర్‌సీతో పనిలేదని, ఓఆర్‌సీ రిజిస్టర్‌లో సర్వే నంబర్‌ లేకపోయినా పాసు పుస్తకం ఉంది కాబట్టి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అసైన్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదై ఉన్న భూముల సర్వే నంబర్లు పహాణీలో పట్టా అని ఉంటే అసైన్డ్‌ కాకుండా పట్టా కింద పరిగణించాలని, పొరపాటున పహాణీలో పట్టా అని నమోదై ఉన్నా పట్టాగానే పరిగణించాలని సీసీఎల్‌ఏ అధికారులు చెబుతున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. అయితే, ఈ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న కారిజ్‌ ఖాతా భూముల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 గతంలో శిస్తు చెల్లించలేని భూములు పట్టా అయినప్పటికీ కారిజ్‌ ఖాతాలో చేర్చారని, ఆ ఖాతాలోని భూములనే పేదలకు అసైన్‌ చేశారని తెలుస్తోంది. పేదలకు అసైన్‌ చేసిన భూముల విషయంలో అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారమే లావాదేవీలు నిర్వహించే వీలుండగా, కారిజ్‌ ఖాతాలో ఉన్న భూమి వివరాలు పహాణీలో పట్టా అని ఉన్నందున వాటిని కూడా అసైన్డ్‌ భూమి నుంచి తొలగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.  

మరిన్ని వార్తలు