పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?

8 May, 2021 13:36 IST|Sakshi
వామన్‌రావు, నాగమణి దంపతులు (ఫైల్‌)

సాక్షి, పెద్దపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వం దృష్టిసారించింది‌. ఈ కేసు విచారణకై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టును కోరింది.  కరీంనగర్‌ జిల్లాలోని ఒక కోర్టును కేసు విచారణకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దపల్లికి చెందిన గట్టు వామన్‌రావు-నాగమణి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్‌(44), శివందుల చిరంజీవి(35), బిట్టు శ్రీను తదితరులను అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.

ఇక ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలో, పుట్ట మధు, ఆయన భార్య శైలజ తదితరులకు కూడా ఇందులో ప్రమేయం ఉందని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు వరంగల్‌ ఐజీకి ఇదివరకే రాశారు. ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో.. గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు ఆచూకీ లభించడం, వామనరావు హత్య కేసులో ఆయనను విచారించడం వంటి పరిణామాలు నేడు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు సైతం ఈ కేసుపై దృష్టి సారించడం గమనార్హం. దీంతో, పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

హత్య వెనుక ఉన్నది వాళ్లే: కిషన్‌రావు
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసు నేపథ్యంలో మృతుడు గట్టు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్‌ ఐజీ నాగిరెడ్డికి గతంలో లేఖ రాశారు. పట్టపగలే తన కొడుకు, కోడలును దారుణంగా హతమార్చారని, నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు.. ‘‘హత్య వెనుక పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజ, కమన్ పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ఉన్నారు. ఈ హత్యలకు గ్రామ కక్షలు, దేవాలయ విషయం కారణం కాదు. నిందితులతో ప్రమాదం పొంచి ఉందని జనవరి 28న రామగుండం పోలీస్ కమిషనర్, మంథని పోలీసులకు ఫిర్యాదు చేశాం. 

పుట్ట మధు ఎమ్మెల్యే గా ఓడిపోయినప్పటి నుంచి నా కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాదు, ఈ హత్యలో స్థానిక నేతలు,అధికారుల తో పాటు పెద్ద తలకాయల పాత్ర ఉంది. జైలులో ఉన్న కుంట శ్రీనివాస్ గుంజపడుగులో నిర్మించే నూతన గృహం ఎవరు నిర్మిస్తున్నారు, డబ్బులు ఎవరు ఇస్తున్నారు. జైల్లో ఉన్న నిందితులతో గ్రామానికి చెందిన వారితో పాటు ఇతరులు కలిసిన విషయంలో విచారణ చేయాలి. లక్కేపురం విజయ బాస్కర్, గట్టు విజయ్ కుమార్ ఆయన కుమారుడు వినయ్, ఆటోడ్రైవర్ వేలాది రఘురాం కాల్ డాటా ను పరిశీలించాలి. 

నా కొడుకు ఆరోజు మంథనికి వస్తున్న విషయం ఎవరికి తెలియదు. కేవలం గ్రామ సర్పంచ్ రాజు మాత్రమే తెలుసు. నా కొడుకు, కోడలు హత్య తర్వాత సర్పంచ్ ఇప్పటి వరకు మమ్మల్ని పరామర్శించలేదు. నిందితుడు కుంట శ్రీను తమ్ముడు కుంట రాజు(సర్పంచ్)తో పాటు హత్య పథకంలో కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ప్రైవేటు అంబులెన్స్ లో వైద్యం అందించలేదు, హత్యకు కారకులైన వారికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి’’అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

చదవండి: Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు