Prabhas Salaar Tickets: ‘సలార్‌’ టికెట్‌ ధర పెంపునకు ప్రభుత్వ అనుమతి

20 Dec, 2023 03:01 IST|Sakshi

ఈనెల 22 నుంచి 28 వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.65, మల్టిప్లెక్స్‌ల్లో రూ.100 టికెట్‌ ధర పెంపు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’కు టికెట్‌ ధరల పెంపునకు, బెనిఫిట్‌ షోలు వేసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైత్రీ మూవీస్‌ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘సలార్‌’చిత్రం ప్రదర్శించే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌ ధరపై రూ.65, మల్టిప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ టికెట్‌ ధర పెంపు ఈనెల 22 నుంచి 28 వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు షో కు, ఆరోజు ఆరో షో వేసేందుకు అనుమతించారు. ఈనెల 22న తెల్లవారుజామున ఒంటిగంటకు ‘సలార్‌’చిత్రం బెనిఫిట్‌ షో వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు