‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పరిహారం లెక్క చదరపు మీటర్లలో..!

9 Apr, 2022 03:31 IST|Sakshi
 రీజనల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మ్యాప్‌ 

సాగునీటి ప్రాజెక్టుల భూపరిహారం చెల్లింపులకు భిన్నంగా ఇవ్వాలని నిర్ణయం

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్వాసితులకు చెల్లింపు

రెండు రోజుల్లో భూసేకరణ నోటిఫికేషన్‌

విడుదల చేసేందుకు రెవెన్యూ అధికారుల కసరత్తు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్‌ రింగ్‌ రోడ్డులో భూసేకరణ పరిహారం చదరపు మీటర్లలో లెక్కించి ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం సేకరించి భూములకు సంబంధించిన పరిహారాన్ని ఎకరాల్లో లెక్కించి చెల్లిస్తారు. ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ రేటుకు నెగోషియేషన్‌ చేసి ధర నిర్ణయిస్తారు.

కానీ ఈ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ఇందుకు భిన్నంగా చదరపు మీటర్లలో లెక్కించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు.

రెండు రోజుల్లో నోటిఫికేషన్‌...
ఈ రహదారి భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అలైన్‌మెంట్‌పై ప్రైవేట్‌ ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఆ సంస్థ ఇటీవలే రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి క్రాస్‌ చెక్‌ చేస్తున్నారు.  భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం వంటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపరుస్తున్నారు.

ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించి, వెంటనే స్థానిక భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం 158.64కి.మీ.ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం సంగారెడ్డి, జోగిపేట్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీఓలు, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్‌ను భూసేకరణ అథారిటీగా నియమించిన విషయం విదితమే. నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు విడుదల చేసిన అలైన్‌మెంట్‌ ప్రకారం ఆర్డీఓలు 113 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ  ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు