ఇది పైసా వసూల్‌ పిటిషన్‌లా ఉంది 

20 Sep, 2022 02:05 IST|Sakshi

పిటిషనర్‌కు రూ.20 వేలు జరిమానా విధించిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: బల్క్‌ డ్రగ్, ఫార్మా ఉత్పత్తుల తయారీ కారణంగా వచ్చే కాలుష్యం గురించి సంబంధిత అధికారులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా.. నేరుగా హైకోర్టును ఆశ్రయించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ దాఖలులో దురుద్దేశాలు ఉన్నందున పిటిషనర్‌కు రూ.20 వేలు జరిమానా విధించింది. రాష్ట్రంలోని బల్క్‌ డ్రగ్, ఫార్మా కంపెనీలు వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయడం లేదని.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. మా తెలంగాణ పార్టీ తరఫున అధ్యక్షుడు కె.వీరారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్‌ బోర్డులో 19 దాకా అప్పీళ్లు దాఖలు చేశారని పీసీబీ తరఫు న్యాయవాది నివేదించారు. వాటి విచారణకు ఆయన హాజరుకాకపోవడంతో బోర్డు విచారణను ముగించిందని చెప్పారు.

అసలు అధికారులకు ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ తీరును తప్పుబట్టింది. ఇది పైసా వసూల్‌ పిటిషన్‌లా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను అనుమతించలేమని తేల్చిచెప్పింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. పిటిషన్‌ను కొట్టివేసింది.  

మరిన్ని వార్తలు