ఫీజులపై బలవంతం చేయొద్దు 

17 Sep, 2022 03:12 IST|Sakshi

మెడికల్‌ కాలేజీలకు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: సీట్లు రద్దయిన కాలేజీల నుంచి ఇతర మెడికల్‌ కాలేజీల్లోకి తరలింపు ద్వారా వచ్చిన విద్యార్థులను ఫీజుల చెల్లింపు కోసం బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. టీఆర్‌ఆర్, మహావీర్‌ మెడికల్‌ కాలేజీల్లో సౌకర్యాలు లేవన్న కారణంగా ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అడ్మిషన్లను రద్దు చేస్తూ జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) జారీ చేసిన ఆదేశాలను టీఆర్‌ఆర్, మహావీర్‌ కాలేజీలు హైకోర్టులో సవాల్‌ చేశాయి.

దీనిపై జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలీ, జస్టిస్‌ పి.కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీట్ల రద్దుతో ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. అయితే విద్యార్థులు ఫీజులను ఇప్పటికే రద్దయిన కాలేజీల్లో చెల్లించారు. ఈ ఫీజులు అందితేనే అడ్మిషన్లు ఖరారు చేస్తామని కేటాయింపు జరిగిన కొత్త కాలేజీలు కోర్టుకు చెప్పాయి.

తాత్కాలికంగా కేటాయింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. దీనికి ధర్మాసనం నిరాకరించింది. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం కనుక అలా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అడ్మిషన్ల రద్దుపై టీఆర్‌ఆర్, మహావీర్‌ కాలేజీల వినతిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాలేజీల అప్పీల్‌పై కేంద్రం నిర్ణయం తీసుకునేదాకా విద్యార్థులను కొనసాగనివ్వాలని కొత్త కాలేజీలకు స్పష్టం చేసింది. ఎంఎన్‌ఆర్‌ కాలేజీకి అనుకూలంగా ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో టీఆర్‌ఆర్, మహావీర్‌ కాలేజీల అప్పీల్‌ను మరోసారి పరిశీలించాలని కేంద్రాన్ని సూచించింది. పిటిషన్లపై హైకోర్టు విచారణను ముగించింది.   

>
మరిన్ని వార్తలు