ఐఐటీల్లో స్టార్టప్స్‌పైనే దృష్టి 

26 Oct, 2022 00:53 IST|Sakshi

సృజనాత్మకత వైపు విద్యార్థుల చూపు 

మార్కెట్‌ అభిరుచులకు అనుగుణంగా ప్రయోగాలు 

హార్డ్‌వేర్‌లోనూ అదే ట్రెండ్‌ 

జాతీయ ఇంజనీరింగ్‌ విద్యలో సరికొత్త మార్పులు  

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బోధనావిధానం వినూత్న ఆలోచనలకు పదును పెట్టేవిధంగా మారుతోంది. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేవిధంగా, విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు ఆలంబనగా ఉంటోంది.కోర్సు ప్రారంభం నుంచే భిన్నమైన ఆలోచనాధోరణికి పదును పెటాల్సిన అవసరం ఉందని సరికొత్త బోధనావిధానంలో కేంద్రం పొందుపర్చింది.

ఐఐటీ విద్యావిధానంపై నాలుగేళ్ల క్రితమే కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ఐఐటీలు మార్పులు చేస్తున్నాయి. ఐఐటీ విద్యార్థులకు మంచివేతనంతో ఉద్యోగం రావడం పెద్ద విషయమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా వాళ్లే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నా రు. కోవిడ్‌కు ముందువరకూ ఈ తరహా ప్రయోగాలపై దృష్టి పెట్టారు. హార్డ్‌వేర్‌లోనూ విద్యార్థులు గణనీయమైన స్టార్టప్స్‌ తయారు చేశారు.  

ఆన్‌లైన్‌ తోడుగా...
వినియోగదారుల అభిరుచి, మార్కెట్‌ పురోగతి వాస్తవ పరిస్థితి, కొత్తగా అన్పించే వస్తువుల రూపకల్పన ఇవన్నీ ఆన్‌లైన్‌ ద్వారా తేలికగా తెలుసుకునే చాన్స్‌ కన్పిస్తోందని హైదరా బాద్‌ ఐఐటీ విద్యార్థి శశాంక్‌ తెలిపారు. ఈ–కామర్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉన్న సాఫ్ట్‌వేర్‌ను వాడుకుంటూ కొత్తవి కనుక్కోవడంపై ఐఐటీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. బిజినెస్‌ టు బిజినెస్, బిజినెస్‌ టు కస్టమ ర్‌ పద్ధతిలో స్టార్టప్స్‌ నెలకొల్పేందుకు ఐఐటీ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. 

హైదరాబాద్‌ ఐఐటీలో ఇదీ పురోగతి
హైదరాబాద్‌ ఐఐటీలో 2017, 18లో కేవలం ఏడు మాత్రమే ఇంక్యుబేటెడ్‌ స్టార్టప్స్‌ నమోదయ్యాయి. 2019లో ఇవి 8కి చేరితే, 2020లో 38 నమోదయ్యాయి. 2021లో 23 ఉంటే, 2022లో 18 నమోదయ్యాయి. కోవిడ్‌ ప్రభావమే స్టార్టప్స్‌ తగ్గడానికి కారణమని హైదరాబాద్‌ ఐఐటీలో చదివిన నివేశ్‌ తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఐఐటీ హైదరాబాద్‌లో హార్డ్‌వేర్‌ సంబంధిత స్టార్టప్స్‌ 43, సాఫ్ట్‌వేర్‌ 34, హైబ్రిడ్‌ 24 తయారయ్యాయి.  

పదును పెట్టాల్సిందే 
ఐఐటీ విద్యార్థుల ఆలోచనాశక్తిని పరిశోధనల వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ల నుంచి సరికొత్త విప్లవాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. సృజనాత్మకతకు పదును పెడితే, భారత్‌ మంచి ఉత్పాదక శక్తిగా ఎదుగుతుంది. 
– వైఎన్‌ సింఘాల్, ఐఐటీ నిపుణులు, ముంబై ఐఐటీ   

పలు వర్సిటీల్లో నమోదైన స్టార్టప్స్‌
►ముంబై ఐఐటీ విద్యార్థులు 2020లో 4కే కెమెరాతో సరికొత్త డ్రోన్‌ రూపొందించారు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్పష్టమైన చిత్రాలను ఫొటోటైప్‌ సాంకేతికతతో అందించేలా తయారు చేశారు. భౌగోళిక, వ్యవసాయపరమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని మరింత ఆధునీకరిస్తే రక్షణ విభాగంలోనూ ఉపయోగించే వీలుంది. వాస్తవానికి భారత్‌ ఇప్పటి వరకూ చైనా డ్రోన్స్‌పైనే ఆధారపడింది. భద్రత కారణాల రీత్యా వీటిని నిషేధించారు. ఐఐటీ విద్యార్థుల టెక్నాలజీని వీటికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.  

►పంటపొలాల్లో కలుపుమొక్కల నివారణకు ప్రస్తుతం కొన్ని రసాయనాలు వాడుతున్నారు. వీటి అవశేషాలు అత్యంత ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థి ఒకరు మోనోవీల్‌తో నడిచే కలుపుమొక్కల నివారణ యంత్రాన్ని సృష్టించాడు. అయితే, ఇది కలుపుమొక్కల్నే కాకుండా పంటకు కూడా నష్టం చేస్తోందని గుర్తించారు. కొన్ని మార్పులు చేస్తే మిర్చి, పత్తి పంటల్లో విజయవంతంగా కలుపు నివారణ చేపట్టడానికి వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దిశగా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది.  

►వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డేటాను క్షణాల్లో ప్రాసెస్‌ చేసి, సమగ్ర సమాచారం ఇవ్వగల ఓ సాప్ట్‌వేర్‌పై ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థి పరిశోధన చేసి పురోగతి సాధించాడు. కోవిడ్‌ సమయంలో ఈ పరిశోధన ముందుకు వెళ్లలేదు. వ్యాధి నిర్ధారణలో ప్రాథమిక సమాచారంతోపాటు అవసరమైన వైద్యవిధానం ఏ దేశంలో ఎలా ఉందనేది తెలియజేయడమే ఈ స్టార్టప్‌ విధానం.   

మరిన్ని వార్తలు