విడిపోయిన రాష్ట్రాన్ని కలపడం అసాధ్యం

9 Dec, 2022 03:24 IST|Sakshi

సజ్జల, బొత్స వ్యాఖ్యలు అర్థరహితం

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘తెలంగాణ విడిపోవడం మాకు ఇష్టం లేదు.. ఉమ్మడి రాష్ట్రమే మా వైఎస్సార్‌ సీపీ విధానమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. విడిపోయిన రాష్ట్రాన్ని కలపడం అసాధ్యం’అని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ పేర్కొన్నారు.

ఖమ్మంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డల కోపాగ్నికి మరోసారి గురికావద్దని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకోసం కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వంతో కలసి రావాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రకటనలు ఇవ్వడం బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డికి సరికాదన్నారు.

బీజేపీ పన్నుతున్న కుట్రలో ఏపీ ప్రభుత్వం పావు కావొద్దని హితవు పలికారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన సరిగా జరగలేదని, తల్లీబిడ్డలను విడదీశారంటూ పలుమార్లు తెలంగాణ అస్థిత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నా రు. షర్మిల కూడా మోదీ మాటలే చెబుతున్నారని ఆరోపించారు. ఏపీలో కలిసిన ఏడు మండలాలను తెలంగాణలో తిరిగి కలపాలని, దీనిపై కొట్లాడటానికి ఏపీ నేతలు కలసి రావాలని కోరారు.

మరిన్ని వార్తలు