టీఆర్‌ఎస్‌ కారులో కయ్యం.. ఏందబ్బా ఇది!

27 Feb, 2022 12:19 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఇప్పటికే కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్య నేతల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25వ తేదీ శుక్రవారం పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటు చేసుకున్న సంఘటన జిల్లా రాజకీయాలనే కుదిపేసింది.

ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు 144 సెక్షన్‌ అమలుకు దారి తీసినా పరస్పర దాడులు మాత్రం తప్పలేదు. సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ఆయన వర్గీయులు, అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.

పాయం వెంకటేశ్వర్లుతో కలిసి అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవిని ‘రేగా’ అనుచరులతో పాటు పోలీసులూ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా, పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. తనను అడ్డుకున్న పోలీసులతో పాయం వెంకటేశ్వర్లు విభేదించారు. దీంతో 144 సెక్షన్‌ అమలులో ఉన్న ప్రాంతంలో ఏఎస్‌ఐ మోహన్‌ విధులకు ఆటంకం కలిగించినందుకు పిడమర్తి రవితో పాటు మరో ఐదుగురిపై 188, 143, 353,ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు చందాలు వసూలు చేసి ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు అనుమతి లేకున్నా వచ్చి తమపై దాడి చేశారంటూ ఆ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నా అశోక్‌.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య, గజ్జల లక్ష్మారెడ్డితో పాటు మరో ఎనమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై 188,143,324,109 ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌.. 
మల్లెలమడుగులో జరిగిన ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో రేగా కాంతారావు.. పొంగులేటి, పిడమర్తి రవిని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు హాట్‌టాపిక్‌గా మారాయి. పిడమర్తి రవిని దళిత ద్రోహిగా అభివర్ణించిన ‘రేగా’ పినపాక నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. కాగా గత ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ పొంగులేటికి సన్నిహితుడు కావడం, వచ్చే ఎన్నికల్లోనూ పాయం ఇదే పార్టీ నుంచి పోటీకి సన్నద్ధమవుతుండడంతో ఇరువర్గాల మధ్య అంతర్గత పోరు మొదలైంది.

ఆది నుంచి పాయం వెంకటేశ్వర్లుకు అండగా ఉంటున్న పొంగులేటిపై ‘రేగా’ విమర్శలకు కారణమిదే అనే ప్రచారం గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, నియోజకవర్గ స్థాయి యువతతో ఆదివారం రేగా కాంతారావు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏ అంశాలు చర్చిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది.   ఏది ఏమైనా.. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు, మార్పులు ఎలా ఉంటాయోననే చర్చ మొదలైంది.  

నేనో సీనియర్‌ ఉద్యమకారుడిని. తెలంగాణ ఉద్యమంలో నేను పోషించిన పాత్ర మీ అందరికీ తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సేవలందించా. పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురంలో మాదిగ జేఏసీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆవిష్కరణకు నన్ను పిలిచింది. అదే కులానికి చెందిన బిడ్డగా ఈనెల 25న నేను ఆ విగ్రహావిష్కరణకు వెళ్తే పది మంది నాపై దాడి చేశారు. నాతో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అడ్డుకున్న పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రోద్బ లంతోనే ఇదంతా జరిగింది. మాకు జరిగిన అవమానంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా.          – పిడమర్తి రవి  

మరిన్ని వార్తలు