ధరణిలో ఇబ్బందాయె రైతు‘బందాయె’!

5 Jan, 2022 03:20 IST|Sakshi

అసైన్డ్‌ భూముల లబ్ధిదారుల సంగతి అంతేనా?

రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్‌ భూములు.. 14 లక్షలకు పైగా అసైనీలు

ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో కొన్ని భూములు

తప్పులు సరిదిద్దేందుకు, కనీసం పౌతీకి కూడా లేని అవకాశం

క్రమబద్ధీకరణపై తేల్చని సర్కారు

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక రెవెన్యూ పరిధిలో ఉన్న 972 సర్వే నంబర్‌లో 14.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఏడెకరాల వరకు భూమిని ప్రభుత్వం ముగ్గురు పేదలకు అసైన్‌ చేసింది. వీరికి పాస్‌పుస్తకాలు కూడా వచ్చాయి. ఇందులో ఒకరి పాస్‌ పుస్తకానికి సంబంధించి డిజిటల్‌ సంతకం పెండింగ్‌ అని ధరణి పోర్టల్‌లో చూపిస్తోంది.

భూమి రకం కూడా తప్పుగా నమోదయింది. ఇప్పుడు వాటిని సరిచేసుకునేందుకు ధరణిలో ఆప్షన్‌ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో గత యాసంగి నుంచి ఆ రైతుకు సంబంధించిన 3.10 ఎకరాల భూమికి రైతుబంధు కూడా రావడం లేదు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఏం చేయాలో ఆ రైతుకు పాలుపోవడం లేదు.

మెజార్టీ రైతులది ఇదే పరిస్థితి: రాష్ట్రంలోని దాదాపు 14 లక్షల మంది అసైన్డ్‌ భూముల లబ్ధిదారుల్లో (అసైనీలు) మెజార్టీ రైతులు ధరణిపోర్టల్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్‌లో ఈ భూముల్లో కొన్నింటిని నిషే ధిత జాబితాలో చూపెట్టడంతో కనీసం వాటిపై ఇతర లావాదేవీలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

అసైనీలు చనిపోతే పౌతీ చేసే (భూమిని వారసుల పేరిట మార్చుకో వడం) ఆప్షన్‌ కూడా లేదు. ఈ భూముల నమోదులో తప్పులు జరిగితే సవరించే అవకా శం లేదు. దీంతో ఆ పేద రైతులకు రైతుబంధు రావడం లేదు. రికార్డులు సరిచేసుకునేందుకు, పేర్లు మార్చుకునేందుకు ఆప్షన్‌ లేకపోవడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. తహసీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోతోంది.

క్రమబద్ధీకరణ ఊసేది?: ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల మాట అటుంచితే ఈ భూముల విషయంలో భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. అసైన్డ్‌ చట్టానికి సవరణలు చేసి ఈ భూములపై అసైనీలకు సర్వహక్కులు కల్పించే దిశలో అన్ని వివరాలు సేకరించింది. జిల్లాల వారీగా అసైన్డ్‌ భూములెన్ని ఉన్నాయి?

అవి అసైనీల చేతుల్లో ఉన్నాయా లేవా? అసైనీల సామాజిక, ఆర్థిక హోదా ఏంటి? అసైన్డ్‌ భూములు చాలావరకు అన్యాక్రాంతం అయిన నేపథ్యంలో థర్డ్‌ పార్టీల సామాజిక హోదా ఏంటి? అనే వివరాలను సేకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం అసైన్‌ చేసిన భూములు సాగు చేసుకుంటున్న రైతుల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి.

వెంటనే నిర్ణయం తీసుకోవాలి
ఈ భూములపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 లక్షల మందికి పైగా అసైనీలు కోరుతున్నారు. నామమాత్రపు ధరకు ఈ భూములను క్రమబద్ధీకరిస్తే అటు పేద రైతులకు పూర్తి స్థాయిలో హక్కులు లభిస్తాయని, మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని వారంటున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అసైన్డ్‌ భూముల విషయంలో  నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు చెబుతున్నా ఇప్పటివరకు తీసుకోలేదు.

నా పేరిట మార్చుకోలేకపోతున్నా
అందె గ్రామంలో నలభై ఏండ్ల క్రితం మా తాత తండ్రుల పేరున 258 సర్వే నంబర్‌లో రెండెకరాల సర్కారు భూమి ఇచ్చారు. గత ఇరవై ఏళ్లుగా నేను ఆ భూమిని సాగు చేస్తున్నాను. ఆ భూమిని పౌతీ కింద నా పేరిట మార్చుకుందామంటే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతు బంధు రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు.
– సూకూరి బాలరాజు, రైతు, అందె, మిరుదొడ్డి మండలం

మరిన్ని వార్తలు