ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు

7 Jan, 2023 01:39 IST|Sakshi

ఆ మేరకు పెంచేలా చర్యలు

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాల్లో సంగారెడ్డి టాప్‌

అక్కడ అత్యధికంగా 86 శాతం డెలివరీలు

జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేటల్లో ప్రైవేటు డెలివరీలు ఎక్కువ

నల్లగొండ, రంగారెడ్డిలో ప్రైవేటులో ఎక్కువగా సి–సెక్షన్లు

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

జిల్లా వైద్యాధికారులు, ఆశా, ఏఎన్‌ఎంలతో సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడంలో కేసీఆర్‌ కిట్, అమ్మ ఒడి సహా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కేవలం 30 శాతం ఉంటే ఇప్పుడు 66 శాతానికి పెరిగాయి. డిసెంబర్‌ నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది.

ఆ జిల్లాలో అత్యధికంగా 86 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగాయి. సబ్‌ సెంటర్ల వారీగా చూస్తే జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిపై డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీంహెచ్‌వోలు క్షేత్ర స్థాయి పర్యటన చేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా సి– సెక్షన్లు జరుగుతున్నాయి. అనవసర సి సెక్షన్లు తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మూడు నెలల ఓపీ పరిశీలిస్తే, రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఓపీ నమోదు చేస్తున్న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కొమురంభీం, జనగాం జిల్లాల్లో పరిస్థితులు మారాలన్నారు.

కేసీఆర్‌ కిట్‌ లో భాగంగా ప్రతి గర్భిణికి నాలుగు ఏఎన్సీ చెకప్స్‌ క్రమం తప్పకుండా చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్‌ సౌకర్యం తీసుకు వచ్చామని, సేవలు గర్బిణులకు అందేలా చూడాలన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీఎంహెచ్‌వోలతో నెలవారీ సమీక్ష నిర్వహించారు.

18 నుంచి కంటి వెలుగు...
ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు రెండో దఫా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆశ, ఏఎన్‌ఎంలను మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు జరిగేలా చూసి, మందులు, కళ్లద్దాలు అందించడంలో క్షేత్రస్థాయిలో ఉండే ఆశాలు, ఏఎన్‌ఎంల పాత్ర కీలకమన్నారు. టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమీక్షలో కుటుంబ, ఆరోగ్య సంక్షేమ కమిషనర్‌ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్‌ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు